సినిమా థియేటర్ల ఆక్యుపెన్సీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి(ఫిబ్రవరి 1) దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లలో 100 శాతం సీట్ల ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చింది. దేశంలో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో కరోనా నిబంధనలను సైతం ప్రభుత్వం సడలిస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 1 నుంచి మరిన్ని సడలింపులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
లాక్డౌన్ తర్వాత దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు ప్రారంభమైన తర్వాత 50 శాతం సీట్ల ఆక్యుపెన్సీకే ప్రభుత్వం అనుమతిచ్చింది. 100 శాతం సీట్ల ఆక్యుపెన్సీకి అనుమతివ్వాలని థియేటర్ల ఓనర్లు, చిత్ర పరిశ్రమ పెద్దలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కేంద్రం కూడా సడలింపులు ఇవ్వాలని నిర్ణయించడంతో థియేటర్ల ఆక్యుపెన్సీకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న నిబంధనలను తొలగిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు.