టీఆర్ఎస్, బీజేపీ మధ్య గొడవ నేపథ్యంలో వరంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రామమందిరం పేరుతో దొంగ బుక్కులు పట్టుకొని బీజేపీ నేతలు చందాలు వసూలు చేస్తున్నారని, ఈ డబ్బులు ఎటుపోతున్నాయని నిన్న ఉదయం పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవిత్రమైన రాముడిని బీజేపీ అపవిత్రం చేస్తోందని సైతం ఆయన ఆరోపించారు. ధర్మారెడ్డి వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించాయి.
నిన్న సాయంత్రం హన్మకొండలోని చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ నేతలు దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ కార్యాలయంపై ప్రతిదాడి చేశారు. పరకాల బీజేపీ ఇంఛార్జ్ విజయచందర్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో రెండు పార్టీల శ్రేణులు ఆందోళ చేస్తున్నాయి.
ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ దాడికి నిరసనగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పరకాలలో బంద్ పాటిస్తోంది. మరోవైపు తమ పార్టీ కార్యాలయంపై టీఆర్ఎస్ దాడిని ఖండిస్తూ బీజేపీ ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొని, నిన్న గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను పరామర్శించడానికి వరంగల్ వెళ్లిన గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రెండు పార్టీల శ్రేణులు ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తుండటంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.