చిత్తూరులో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని ముందస్తుగా రేణిగుంట ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలను కూడా పోలీసులు గృహ నిర్బంధం, ముందస్తు అరెస్టులు చేశారన్న విషయం అందరికి తెలిసింది.
స్థానిక ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలపై అధికార పక్షం దౌర్జన్యానికి పాల్పడిందని చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆరోపించి కొనసాగింపుగా జిల్లా కేంద్రం చిత్తూరులో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

అయితే టీడీపీ నేతల నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తూ ఆదివారం రాత్రి పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ టీడీపీ నేతలు మాత్రం వెనక్కి తగ్గేది లేదని ప్రకటించి ఆందోళనకు సన్నాహాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికే చంద్రబాబు కూడా హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చిత్తూరు వెళ్లి ధర్నాలో పాల్గొంటారని టీడీపీ నేతలు ప్రకటించారు. ఈలోపునే జిల్లా వ్యాప్తంగా పోలీసులు టీడీపీ ముఖ్య నాయకుల హౌస్ అరెస్టులకు దిగారు.
ఈలోగా జిల్లావ్యాప్తంగా పోలీసులు, పలమనేరులో మాజీ మంత్రి ఎన్.అమర్నాథరెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నానితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలను అక్కడికక్కడే అరెస్టు చేశారు.

టీడీపీ నిరసన కార్యక్రమాల వల్ల ఇప్పటికే అమలులో ఉన్న ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలుగుతుందంటూ చంద్రబాబుకు పోలీసులు ఇంతకుమునుపే నోటీసు ఇచ్చారు. చిత్తూరులో చంద్రబాబు ధర్నాకు ఎలాంటి అనుమతులు లేనందున ఎవరిని అనుమతించమని జిల్లా ఎస్పీ ప్రకటించిన కారణంగా చంద్రబాబుని కూడా ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకుని బయటకు రాకుండా నిరోధించారు. దీనితో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయగా ఎయిర్ పోర్టులో నేలపై భైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. పోలిసుల వ్యవహారాన్ని తప్పు పట్టారు.