హైదరాబాద్‌లో పోలీస్‌ డ్రోన్‌ సైరన్‌ త్వరలోనే ప్రారంభంకాబోతోంది.ప్రమాద స్థలికి డ్రోన్‌
నిమిషాల్లో చేరుకొని, డ్రోన్ల ద్వారానే బాధితులతో మాట్లాడే ఏర్పాటు, క్షణాల్లో కమాండ్‌ సెంటర్‌కు సంఘటన వివరాలు చేరే ఏర్పాటు జరగనుంది. దీని ద్వారా అనుక్షణం కేటుగాళ్లపై నిఘా కూడా వేయవచ్చు.వారి ప్రతి కదలిక గమనించవచ్చు. తద్వారా ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుందని పోలీస్ శాఖా వారు వివరణ ఇచ్చారు.

ఇక అసలు విషయానికి వస్తే టెక్నాలజీ వినియోగంలో ఎప్పటికప్పుడు విప్లవాత్మకమైన చర్యలు చేపడుతున్న తెలంగాణ పోలీసులు మరొక నూతన కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. ఏదయినా ప్రమాద ఘటన, విద్రోహక చర్య కాని జరిగిన ప్రదేశాలకు నిమిషాల వ్యవధిలో చేరుకొనేందుకు ప్రత్యేక డ్రోన్లను సిద్ధం చేస్తున్నారు. అత్యాధునిక కెమరాలు, లైటింగ్‌, స్పీకర్లతో జీపీఎస్‌ ఆధారంగా పనిచేసే ఈ డ్రోన్లు ప్రమాద తీవ్రతను అక్కడి పరిస్థితులను క్షణాల్లో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరవేసి పోలీసులను సన్నద్ధం చేస్తాయి. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇటీవల కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా మున్సిపల్‌, పరిశ్రమలశాఖ, ఐటీ మంత్రి కే టి ఆర్ ఇచ్చిన సూచనల మేరకు పోలీసు యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా తెలుస్తుంది.. ‘పోలీస్‌ విధుల్లో ఘటనాస్థలానికి ఫస్ట్‌ రెస్పాండర్స్‌గా డ్రోన్లను పంపే వీలును ముందుగా పరిశీలించి, ఎవరైనా మహిళ ఆపదలో ఉండి ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కితే సమాచా రం అందుకున్న వెంటనే ఆ ప్రదేశానికి డ్రోన్లను పంపి, అందులో ఉన్న కెమెరాల ద్వారా నేరస్థుల కదలికలపై నిఘా పెట్టి, పోలీస్‌ సైరన్‌తో డ్రోన్‌ కనిపిస్తే నేరస్థులను కట్టడి చేయవచ్చు’ అని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఈ అంశం మీద దృష్టిపెట్టిన పోలీసు అధికారులు మొదట హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో డ్రోన్లను వినియోగించాలని, ముందు టెస్ట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వీటిని ఉపయోగించేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే టెస్ట్‌ డ్రైవ్‌ ప్రారంభించినట్టు అధికార వర్గాల సమాచారం. త్వరలోనే ఎక్కడ ఏ నేరం, ప్రమాదం జరిగినా ఆకాశంలో వెంటనే పోలీస్‌ సైరన్‌ మోగుతుంది.

ప్రతి డ్రోన్ పోలీస్‌ సైరన్‌, అత్యాధునిక కెమెరా, ప్రత్యేక లైట్లు కలిగి ఉంటుంది. ఈదిన సంఘటన జరగగానే ఆ లొకేషన్ సమాచారాన్ని బట్టి జీపీఎస్‌ సాయంతో అక్కడికి నిమిషాల్లో చేరిపోయి ఆటోమెటిక్‌గా పనిచేస్తాయి. ప్రతి డ్రోన్ మూడు కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిని కవర్‌ చేస్తుంటుంది. పగలు, రాత్రివేళల్లో కెమెరాల సామర్థ్యం,
క్రైం స్పాట్‌కు చేరడంలో డ్రోన్లు ఎదుర్కొంటున్న అవరోధాలు, స్పాట్‌లోని వ్యక్తులకు పోలీసులు ఇచ్చే సూచనలు వినిపించేలా స్పీకర్ల సామర్థ్యాన్ని పెంచడం మొదలయిన అంశాలు ఇంకా పరీక్షిస్తున్నట్టు ఒక పోలీస్ అధికారి వివరించారు. ఎవరూ డ్రోన్లు నాశనం చేసే వీలు లేకుండా దాని ఎత్తు, దూరం ఇంతలో ఉండాలనే విషయం ఇంకా అధ్యయనంలోనే ఉంది.

నేరం జరిగినట్టుగా పోలీసులకు సమాచారం అందిన వెంటనే ఆ ప్రదేశాన్ని లొకేషన్ బేస్డ్
సర్వీసుద్వారా కనిపెట్టి డ్రోన్లకు పంపుతారు. మామూలు రవాణా వ్యవస్థను ఉపయోగిస్తే ఇలాంటి సమయాల్లో ఆలస్యం అవ్వడం వల్ల ప్రమాద స్థాయి ఇంకా పెరగవచ్చు, మరియు ఆక్సిడెంట్ లాంటివి జరిగినప్పుడు దాని తీవ్రత తెలియక ఒక్కోసారి సరయిన ప్రధమ చికిత్స చేసే సాధనాలు లేక కొన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోవడం లాంటి అవరోధాలు కలిగే అవకాశం కూడా ఉంది.కాని గాల్లో వెళ్లే డ్రోన్ల వల్ల ఎలాంటి అవరోధాలు ఉండవు. ట్రాఫిక్ జాం అంటూ ఉండదు.ఘటనా స్థలానికి నిమిషాల్లో చేరుకొని అక్కడి పరిస్థితిని వీడియోలు, ఫోటోల ద్వారా క్షణాల్లో కమాండ్ పెట్రోల్ సెంటర్ కు చేరవేస్తుంటే ఒక అంచనాకు వచ్చే అవకాశం కలుగుతుంది. మరియు పరిస్థితిని అంచనా వేసి అవసరం మేరకు సిబ్బందిని అప్రమత్తం చేసే వీలు కూడా ఉంటుంది.
అదే విధంగా డ్రోన్లకు ఉండే పోలీస్ సైరన్ వల్ల నేరస్తుడికి పోలీసులు వస్తున్నారేమో అనే భయం కలుగగా, ‌బాధితులకు ధైర్యం కలిగే అవకాశం కూడా ఉంటుంది. స్పీకర్ల ద్వారా పోలీసులు నేరుగా బాధితులతో మాట్లాడి సూచనలు ఇవ్వవచ్చు. క్రైం సీన్‌ను బట్టి అంబులెన్స్‌, ఫైర్‌ తదితర విభాగాలను అలర్ట్‌ చేసి ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది.