ఒక డ్రైవర్ అజాగ్రత్త ఏడేళ్ల బిడ్డకు శాపమయి ప్రాణాలు తీసింది.ఒక తల్లికి నూరేళ్ళ శిక్ష విధించింది. తన బిడ్డకు అప్పుడే నిండు నూరేళ్లు నుండిపోయాయని ఆ తల్లి రోదిస్తుంటే చూసే వాళ్ళకు కూడా కళ్ళు అశ్రుపూరితలయ్యాయి. కష్టమైనా కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది ఆ తల్లి. తాత దగ్గరకు వెళ్తానని అడిగితే ఎన్నో జాగ్రత్తలు చెప్పి మరీ పంపించింది. ధర్మపురికి చెందిన రాజారాంపల్లి గ్రామంలో దాసరి హరీష్ (7 ) ఆదివారం జరిగిన రోడ్ ప్రమాదంలో అసువులు బాసాడు. గ్రామానికి చెందిన దాసరి పోచయ్య-సత్తమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు హరీష్ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 3 వ తరగతి చదువుతుండగా, స్కూల్ కి శలవు ఉండడంతో పెదనాన్న కొడుకుతో కలిసి తాత దగ్గరకి వెళ్ళాడు. మేకలు కాసేందుకు తాత తో పాటు గ్రామ శివారుకు వెళ్ళాడు. ఆ తరువాత ఎండగా ఉందన్న కారణంతో తిరిగి ఇంటికి వెళ్లిపొమ్మని పంపించగా ఇద్దరు చిన్నారులు ఆడుతూ పాడుతూ నడుచుకుంటూ వెళ్తున్న తరుణంలో వరంగల్-రాయపట్నం హైవే రోడ్డు దాటుతుండగా ధర్మారం నుంచి లక్షెట్టిపేట వైపు వెళ్తున్న ఏపీ 01 ఎక్స్ 3483 నెంబర్ గల తూఫాన్ వాహనం హరీశ్‌ను వేగంగా ఢీకొట్టింది. దీంతో హరీష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మరణ వార్తను విని హృదయవిదారకంగా విలపిస్తూ అక్కడికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న బిడ్డను చూసి గుండె పగిలేలా రోదిస్తుంది. హరీష్ తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.