దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతున్న విషయం పాఠకులకు విదితమే! అయితే క్రితం రోజు కంటే ఈరోజు కేసులలో కొంతమేర తగ్గుదల కనిపించింది. ఆదివారం 15,510 మందికి వైరస్ సోకిందని, దానితో మొత్తం కేసుల సంఖ్యా కోటి పదకొండు లక్షలకు పైగా చేరిందని మరణాల సంఖ్యా వందకుపైనే కొనసాగుతుందని తేలింది. తాజాగా 106 మంది వైరస్ కు బలి అయ్యారు. ఇప్పటి వరకు 1,57,157 మంది కరోనా కారణంగా ప్రాణాలు వదిలారు.

అయితే క్రియాశీల కేసులు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్త కేసుల్లో పెరుగుదల, రికవరీల్లో తగ్గుదల వల్ల ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ రేట్ 1.52 శాతానికి చేరుకోగా, నిన్న ఒక్కరోజే 11,288 మంది వైరస్ నుంచి కోలుకోవడం జరిగింది.నిన్న 6,27,668 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

మరొకవైపు నేటి నుండి టీకా రెండో దశ కార్యక్రమం మొదలవడంతో 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాలు లోపు ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు టీకాలు అందచేయబడుతున్నాయి. ఇప్పటివరకు 1,43,01,266 మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. మొదటి దశలో ఇప్పటికే ఒక డోసు తీసుకున్నవారికి రెండో డోసును కూడా అందిస్తున్నారు.