పొదుపు పథకాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుందని పాఠకులకు తెలిసిన విషయమే! అయితే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై మాత్రం వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) వడ్డీరేటుపై 0.7 శాతం, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ (ఎన్‌ఎస్‌సీ) వడ్డీరేటుపై 0.9 శాతం, సేవింగ్స్‌ డిపాజిట్లపై 0.5 శాతం తగ్గిస్తున్నట్టు, 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30) సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్పులు చేసినట్లు ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వడ్డీ రేట్లను 1.1 శాతం వరకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ నిన్న జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. 2020-2021 చివరి త్రైమాసికం ప్రకారమే వడ్డీరేట్లు ఉంటాయని ఈమేరకు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.