కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్‌ పంచాయత్‌ సశక్తీకరణ్‌ పేరిట 2021 అవార్డులను మంగళవారం ప్రకటించిన తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కూడా జాతీయ పంచాయతీ రాజ్‌ అవార్డులు వరించాయి. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీలు అను మూడు విభాగాల్లో అవార్డులను ప్రకటించగా దీన్‌దయాల్‌ పంచాయత్‌ సశక్తీకరణ్‌-2021 సంవత్సరానికి గానూ పలు విభాగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 13, తెలంగాణకు 13 అవార్డులు దక్కాయని కేంద్ర పంచాయతీ రాజ్‌శాఖ ప్రకటనను విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో అవార్డు గెలుపొందిన జిల్లాలు:
జిల్లా పరిషత్‌లకు.. కృష్ణా, గుంటూరు జిల్లా, దీంతోపాటు చిత్తూరు జిల్లాలోని సదుం, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్‌, అనంతపురం జిల్లాలోని పెనుకొండ, కృష్ణా జిల్లాలోని విజయవాడ రూరల్‌ మండలాలకు అవార్డులు వరించాయి.
గ్రామ పంచాయతీల్లో.. చిత్తూరు జిల్లాలోని రేణిమాకులపల్లె, నెల్లూరు జిల్లాలోని తాళ్లపాలెం, తడ కండ్రిగ, ప్రకాశం జిల్లాలోని కొండేపల్లి, విశాఖపట్నం జిల్లాలోని పెదలబుడు, గుంటూరు జిల్లాలోని గుళ్లపల్లి, కర్నూలు జిల్లాలోని వర్కూరుకు కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ దీన్ దయాళ్ అవార్డులు దక్కాయి.

తెలంగాణలో అవార్డు గెలుపొందిన జిల్లాలు:
గ్రామ పంచాయతీలకు.. మెదక్‌ జిల్లా పరిషత్‌, కోరుట్ల, ధర్మారం మండల పరిషత్‌లతో పాటు పలు అవార్డులు వరించాయి. కరీంనగర్‌ జిల్లాలోని పర్లపల్లి పంచాయతీకి, సిరిసిల్ల జిల్లాలోని హరిదాస్‌ నగర్‌, మోహినీకుంట, సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లె, మల్యాల, ఆదిలాబాద్‌ జిల్లాలోని రుయ్యాడి, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చక్రాపూర్‌ పంచాయతీలకు పురస్కారాలు లభించాయి. పెద్దపల్లి జిల్లా సుందిళ్ల పంచాయతీకి మాత్రం రెండు విభాగాల్లో అవార్డులు వరించాయి.