రాజకీయం (Politics) వార్తలు (News)

నేతల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు పౌర హక్కుల, ప్రజా సంఘాల నేతలు, విరసం సభ్యుల ఇళ్లలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) సోదాలు నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లా పల్లిసారథి, రాజాంలలోనూ సోదాలు చేసారు. ఇక విశాఖ జిల్లా మంచంగిపుట్టులో 2020 నవంబరులో పోలీసులు అరెస్ట్ చేసిన మావోయిస్ట్ కొరియర్ పంగి నాగన్న కేసు దర్యాప్తులో భాగంగానే ఎన్ఐఏ సోదాలు చేస్తోందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఈ కేసును ఈ ఏడాది మార్చి 7న ఏపీ పోలీసులు ఎన్ఐఏకి అప్పగించారు. విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో న్యాయవాది కె.పద్మ, చినవాల్తేరులో న్యాయవాది కె. ఎస్.చలం ఇళ్లలోనూ అర్ధరాత్రి వరకు సోదాలు జరగగా న్యాయవాది పద్మ ఇంటి నుంచి హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు, సెల్‌ఫోన్లు ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.

హైదరాబాద్‌లో పౌర హక్కుల సంఘం తెలంగాణ ఉపాధ్యక్షుడు వి.రఘునాథ్ ఇంటిలో, ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో విరసం రాష్ట్ర మాజీ కార్యదర్శి వరలక్ష్మి ఇంటిలో, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సంఘం ఏపీ ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ ఇంటిలో, అలాగే డప్పు రమేశ్, పలువురు ఇతర నాయకుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్‌లో ప్రజా కళా మండలి రాష్ట్ర అధ్యక్షుడు జాన్ నివాసంలోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు.

పోలీసులు అక్రమంగా సోదాలు చేస్తున్నారని పౌర హక్కుల సంఘం తెలంగాణ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావులు ఖండించారు.
తెలంగాణలో శిల్ప, దేవేంద్ర, కోటి.. ఏపీలో చిట్టిబాబు, పాణి తదితర నేతల ఇళ్లలో సోదాలు చేశారని… సోదాలు, దాడులు ఆపి 142 సెక్షన్ ప్రకారం నోటీసులు ఇస్తే వివరణ ఇస్తామని అది సంతృప్తిగా లేకపోతే అరెస్ట్ చేయాలని, కుటుంబసభ్యులను, చుట్టు పక్కలవారిని భయభ్రాంతులకు గురిచేసేలా ఇలా దాడులు, సోదాలు చేయడం తగదని ఆయన అన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.