తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్‌లో భాగంగా రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తున్నందున ప్రభుత్వం కూడా కట్టడిచర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే హైదరాబాద్‌లోని మెడికల్ షాపులను తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కోవిడ్ గైడ్‌లైన్స్‌ను గతంలో మాదిరిగా మరోసారి అమలు చేయాలని, ఎవరైనా దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్నాయని మందులు అడిగితే ఇవ్వకూడదని సూచించింది.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులు ఇవ్వవద్దని ఆదేశించింది. దగ్గు, జలుబు ఉన్నవారు తేలిగ్గా తీసుకొని కరోనా పరీక్షలు చేయించుకోకుండా సొంతంగా మందులు వేసుకుంటున్న నేపథ్యంలో గతంలోనే ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. అలాగే అన్ని మెడికల్ షాపుల్లోనూ ‘నో మాస్క్ – నో మెడిసిన్’ బోర్డును ఉంచాలని ఆదేశించింది. అంతేకాక, కరోనా లక్షణాలు ఉన్నవారు నేరుగా ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని కూడా సూచించింది.