జాతీయం (National) వార్తలు (News)

ఓ తండ్రి ఆవేదన …అన్వేషణ…

మంజూర్‌ అహ్మద్‌ వాగే కుమారుడు 24ఏళ్ల షకీర్‌ 2016లో భారత సైన్యంలోని టెరిటోరియల్‌ ఆర్మీలో రైఫిల్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది ఆగస్టు 2న ఈద్‌ను పురస్కరించుకుని సెలవుపై ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి సాయంత్రం తిరిగి ఆర్మీ క్యాంప్‌కు వెళ్లారు. ఆ తర్వాత గంటకు ఇంటికి ఫోన్‌ చేసి తాను స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నానని, ఆర్మీ అధికారులు ఫోన్‌ చేసి అడిగితే కంగారుపడొద్దని చెప్పారు. ఆ మరుసటి రోజే కుల్గాం జిల్లాలో షకీర్‌ వాహనం మంటల్లో పూర్తిగా కాలిపోయి కన్పించగా అతడిని ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి ఉంటారని పోలీసులు అనుమానించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అతడి ఆచూకీ మాత్రం వారం రోజుల వరకు తెలియలేదు. సరిగ్గా వారం తర్వాత మంజూర్‌ అహ్మద్‌ ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో రక్తంతో తడిసిన షకీర్‌ దుస్తులు కన్పించడంతో ఆ దుస్తులను చూసి అహ్మద్‌ కుప్పకూలిపోయారు. గుండెలవిసేలా రోదించారు.

షకీర్‌ను నలుగురు ఉగ్రవాదులు చిత్రహింసలు పెట్టడం తను చూశానని స్థానికంగా ఉండే ఓ మహిళ చెప్పడంతో ఇవన్నీ చూశాక, తన కొడుకు బతికి ఉండే అవకాశం లేదని ఆ తండ్రికి అర్థమైంది. కనీసం మృతదేహాన్ని అప్పగించినా చాలని అధికారులను వేడుకోగా అది కూడా జరగలేదు. షకీర్‌ అదృశ్యమైన కొద్దిరోజుల తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఓ ఆడియో క్లిప్‌ ‘‘ఉగ్రవాదులను చంపేసిన తర్వాత వారి శవాలను ప్రభుత్వం అప్పగించట్లేదు. దానికి ప్రతీకారంగా మేం కూడా ఈ సైనికుడి మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు ఇవ్వం’’ అన్నది ప్రసారం అయ్యింది. పోలీసులు మాత్రం షకీర్‌ది మిస్సింగ్‌ కేసుగానే నమోదు చేశారు. కీర్‌ను ఎక్కడ సమాధి చేశారో తమకు తెలియదని, దానిపై తాము దర్యాప్తు చేస్తున్నామని చెప్పడంతో కుమారుడి మృతదేహం కోసం తానే స్వయంగా అన్వేషణ మొదలుపెట్టి ఘటన జరిగిన తర్వాత స్థానికులు చెప్పిన ఆధారాలతో తన గ్రామానికి సమీపంలో ఉన్న పొలాల్లో భూమిని తవ్వడం మొదలుపెట్టారు. గత ఎనిమిది నెలలుగా కొడుకు కోసం మట్టిని తవ్వుతూనే ఉన్నారు.

‘‘మా ఇంటికి ఏడు కిలోమీటర్ల పరిధిలోనే తన శవాన్ని సమాధి చేసి ఉంటారని నా మనసు చెబుతోంది. కొడుకు ఎలాగూ దక్కలేదు. కనీసం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేస్తే అయినా వాడి ఆత్మకు శాంతి కలుగుతుందన్న చిన్న ఆశ. నేను అధికారులను కోరుకునేది ఒక్కటే.. నా కొడుకును ఎలాగూ కాపాడలేకపోయారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన షకీర్‌ను అమరుడిగా ప్రకటించండి చాలు..!’’అని గద్గద స్వరంతో ఆ తండ్రి కోరుకుంటున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.