బంజారాహిల్స్‌లో మంగళవారం రాత్రి 10.15గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని ఆల్మండ్‌ హౌస్‌ పక్కసందులో ఓ యువతిని ఇద్దరు వ్యక్తులు బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని పోయారంటూ సోషల్‌మీడియాలో వచ్చిన వార్తలు అబద్దమని తేలింది. అయితే కిడ్నాప్‌కు సంబంధించి బంజారాహిల్స్‌ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. స్థానికులను విచారించగా ముగ్గురు యువకులు, ఓ యువతి బైక్‌లపై వచ్చారని, యువతి గట్టిగా కేకలు పెడుతుండడంతో ఓ యువకుడు ఆమెను బైక్‌పై ఎక్కించుకుని వెళ్లాడని తేలింది. సమీపంలోని సీసీ ఫుటేజీలో కూడా ఇదే విషయం తేలింది.

ముగ్గురు యువకులతో కలిసి మద్యం సేవించిన యువతి రోడ్డుపై న్యూసెన్స్‌ చేస్తుండడంతో ఆమెను బైక్‌పై ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకుపోయినట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు. మద్యం మత్తులో యువతి గోటు హెల్‌ అని కేకలు వేస్తే ఆమె హెల్ప్‌ అని కేకలు పెట్టిందని భావించిన స్థానికులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మొత్తం మీద యువతి కిడ్నాప్‌ జరగలేదని తేలడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.