వార్తలు (News) వినోదం

కొమురం భీం జిల్లాలో వెలుగు చూసిన జలపాతం.. !!

అందాల అడవులకు ఆలవాలం అయిన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని అడవుల్లో ఎత్తైన కొండలు అందమైన జలపాతాలు కూడా ఉన్నాయి. తిర్యాని అడవులలో ఇప్పటికే ఎన్నో జలపాతాలను గుర్తించగా తాజాగా మరో అద్భుతమైన జలపాతాన్ని ఫారెస్ట్ అధికారులు గుండాల జలపాతానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం అడవిలో తిరుగుతున్నప్పుడు ఒక్కసారిగా నీటి శబ్దం వినిపించడంతో అటు వైపు వెళ్ళి చూస్తే దాదాపు 60 అడుగుల ఎత్తు నుండి నీరు కిందకు ప్రవహిస్తోంది. జలపాతం అద్భుతంగా ఉండటంతో నా ఫోన్లో వీడియో తీసి అందరికీ చూపించాను. ఈ జలపాతానికి బైసన్ జలపాతం అని నామకరణం చేశాం.

ఈ జలపాతానికి వెళ్లడానికి అనుకూలంగా అన్ని ఏర్పాట్లను చేస్తే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందవచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా తిర్యానీ అడవుల్లో చింతల మాదారం జలపాతం కూడా ఎంతో పాపులర్ అయ్యింది. ఈ జలపాతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. గోదావరిఖని, కరీంనగర్, మంచిర్యాల లాంటి చుట్టుపక్కల ఉన్న పట్టణాలనుండి పర్యాటకులు వస్తూ ఉండగా జలపాతం వద్ద ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడం తో ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి.

నీటిలో దిగకుండా దూరంనుంచి చూడటానికి మాత్రం ఈ జలపాతం అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా తిర్యాణి అడవుల్లో చిచ్చర లొడ్డి, పిల్లి గుండం జలపాతాలు కూడా ఉన్నాయి. మరోవైపు తిర్యానీలో చెలమల ప్రాజెక్టు కూడా ఉంది. చుట్టూ అడవులు మధ్యలో ఉన్న ఈ ప్రాజెక్టు ఎంతో ఆహ్లాదకరంగా అందంగా కనిపిస్తుంది. ప్రభుత్వం గనుక శ్రద్ధ పెడితే ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని అడవులు గొప్ప పర్యాటక కేంద్రంగా తయారయ్యే అవకాశం ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    86
    Shares
  • 86
  •  
  •  
  •  
  •