త్వరలో విజయవాడ-హైదరాబాద్‌ మధ్య సీప్లేన్‌ సర్వీసు ప్రారంభించడానికి సన్నాహాలు ఇప్పటికే మొదలు పెట్టారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌లో వాటర్‌ ఎయిరోడ్రోమ్‌ నిర్మాణాన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌ మంత్రిత్వ శాఖ చేపడుతుంది. ఈ మేరకు 2021 జూన్‌ 15న ఆ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ రాజ్యసభలో ప్రకటించారు.

వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ సాధారణ ప్రజలకు సైతం విమాన ప్రయాణాన్ని అందుబాటులో తీసుకువచ్చేందుకు తమ మంత్రిత్వ శాఖ 2016 అక్టోబర్‌లో రీజనల్‌ కనెక్టివిటీ (ఉడాన్‌) పథకాన్ని ప్రవేశపెట్టినట్లు,కానీ ఈ పథకం మార్కెట్‌ డిమాండ్‌ను బట్టే అమలులోకి వస్తుందని అన్నారు. వివిధ మార్గాల్లో డిమాండ్‌ ఎలా ఉందో ఎయిర్‌లైన్స్‌ సంస్థలు అధ్యయనం చేసిన తరువాతే ఆ మార్గాల్లో బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా ఎయిర్‌లైన్స్‌ ఎంపిక జరుగుతుందని మంత్రి తెలిపారు.

ఇదే విధంగా ఇప్పటికి నాలుగు రౌండ్ల బిడ్డింగ్‌ అనంతరం విజయవాడ-హైదరాబాద్‌ మధ్య సీప్లేన్‌ సర్వీసుల నిర్వహణకు వాటర్‌ ఎయిరోడ్రోమ్‌ నిర్మాణానికి అనువైన ప్రదేశంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌ను గుర్తించినట్లు, వాటర్‌ ఎయిర్‌డ్రోమ్‌ నిర్మాణం పూర్తయిన అనంతరం ఎంపిక చేసిన ఎయిర్‌లైన్స్‌ సంస్థ రెండు మాసాల్లో సీప్లేన్‌ సర్వీసులను ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు.