ప్రకాశం జిల్లా పామూరు మండలం మోపాడు రిజర్వాయర్‌ కట్ట కింది భాగంలో లీకవుతుండడంతో 5గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాలకు మోపాడు రిజర్వాయర్‌ పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతోంది. దీనికి తోడు వాగులు, వంకల నుంచి రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ రిజర్వాయర్‌లో 2.09 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

ఈ ఉదయం నుంచి రిజర్వాయర్‌ కట్టకు అడుగు భాగంలో ఐదు చోట్ల నీరు లీకవుతోంది. స్థానికులు, రైతులు అది గమనించి వెంటనే నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ రిజర్వాయర్‌ కింద సుమారు 20వేల ఎకరాలు సాగవుతున్నాయి. నీరు లీకవుతుండటంతో రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.

జిల్లాలోని పామూరు పాత చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతోంది. చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉండడంతో జేసీ వెంకటమురళి, అధికారులు చర్యలు చేపట్టారు. అలుగు పారుతున్న నీరు 565 జాతీయ రహదారిపైకి వచ్చి గోపాలపురం ఎస్సీకాలనీని ముంచేయగా సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.