భారతీయ రైల్వే సరికొత్త అధ్యయనానికి దారి తీస్తూ ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను మణిపుర్​లో పిల్లర్లతో నిర్మిస్తోంది. మణిపూర్‌లోని జిరిబమ్‌-ఇంఫాల్ మధ్య 111 కిలోమీటర్ల పొడవైన రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా 141 మీటర్ల ఎత్తైన స్తంభం నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్​ పిల్లర్​గా ఇది నిలవనుందని రైల్వేశాఖ తెలిపింది. ఈ రైల్వే బ్రిడ్జ్ మొత్తం పొడవు 703 మీటర్లు కాగా వంతెన పిల్లర్లను హైడ్రాలిక్ అగర్స్ ఉపయోగించి నిర్మిస్తున్నారు.

ఇప్పటివరకు ఐరోపాలోని మాంటెనెగ్రో వద్ద ఉన్న 139 మీటర్ల మాలా-రిజెకా వయాడక్ట్ రికార్డును అధిగమించి మణిపూర్‌లో 141 మీటర్లతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను భారతీయ రైల్వే నిర్మిస్తుండడంతో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే 111 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు నుంచి రెండున్నర గంటల్లో చేరుకోవచ్చని ఈ రైల్వే ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ సందీప్ శర్మ తెలిపారు. ప్రస్తుతం జిరిబమ్‌-ఇంఫాల్ మధ్య రైలు మార్గం లేకపోవడం వల్ల రోడ్డు మార్గం (ఎన్‌హెచ్‌-37) ద్వారా ప్రయాణించాల్సిందే. ఈ రోడ్డు మార్గంలో జిరిబమ్ నుంచి ఇంఫాల్‌కు 220 కిలోమీటర్లు దూరం కావడంతో ఈ మార్గంలో ప్రయాణానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. అందుకే దూరాన్ని, సమయ భారాన్ని తగ్గించడం కోసం లజయ్ నది మీదుగా ఆ రెండు నగరాల మధ్య రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తయితే ఎత్తయిన స్తంభాలతో నిర్మిస్తున్న ఈ వంతెన ప్రపంచంలోనే ఎత్తయిన వంతెనగా గుర్తింపు పొందనున్నది.

2008లో 13,800 కోట్లతో మంజూరైన ఈ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా 12 కిలోమీటర్లు బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా, రెండో దశ పనులు 2022, ఫిబ్రవరి నాటికి పూర్తవుతాయని సందీప్ శర్మ తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి రైల్వే వంతెన పూర్తిగా ప్రయాణానికి అందుబాటులోకి వస్తుందన్నారు. హిమాలయ కొండల్లో రైల్వేశాఖ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 47 సొరంగాలు, 156 వంతెనలు ఉంటాయని తెలిపారు.