కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి నిపుణుల మాట ఏమి చెప్తారో చూద్దాం..
”ఒమిక్రాన్‌లో 30 కంటే ఎక్కువ మ్యుటేషన్లు ఉన్నాయి. వైరస్ స్పైక్ ప్రోటీన్‌లో ఈ మ్యుటేషన్లు ఏర్పడ్డాయి” అని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. ”వైరస్ స్పైక్ ప్రోటీన్‌లో మ్యుటేషన్ కారణంగా ఈ వేరియంట్ రోగనిరోధక శక్తిని ఎదురించగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటుంది. టీకాల వల్ల శరీరంలో ఏర్పడిన రోగ నిరోధక శక్తి లేదా మరే ఇతర ఇమ్యూనిటీ కూడా ఈ వైరస్‌ను ప్రభావితం చేయలేదు”. ”అటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని అన్ని కోవిడ్ వ్యాక్సీన్లను సమీక్షించాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా వ్యాక్సీన్లు, వైరస్ స్పైక్ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలను అభివృద్ధి చేస్తాయి. దీని ఆధారంగానే వైరస్ పనిచేస్తుంది” అని ఆయన చెప్పారు. ”ఇప్పుడు ఒమిక్రాన్ ఈ స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలోనే మ్యుటేషన్ చెందుతోంది. అంటే దీనిపై వ్యాక్సీన్లు మరీ అంత సమర్థంగా పనిచేయకపోవచ్చు” అని గులేరియా అభిప్రాయపడ్డారు.

దక్షిణాఫ్రికాలో ఈ నెలలోనే ఒమిక్రాన్ వేరియంట్‌ను కనుగొన్నారు. తర్వాత దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు సమాచారమిచ్చారు. నవంబర్ 24న ఈ కొత్త వేరియంట్‌ను ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్‌వో ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. ఈ వేరియంట్‌లో చాలా మ్యుటేషన్లు ఉన్నాయని, ప్రాథమిక లక్షణంగా రీఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు ఒక ప్రకటనలో డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఒమిక్రాన్‌తో రిస్క్‌ ఎక్కువే, తీవ్ర పరిణామాలు తప్పవని తాజాగా డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. కానీ ఈ కొత్త వేరియంట్‌ను దక్షిణాఫ్రికా డాక్టర్ ఏంజెలిక్ కోట్జీ గుర్తించారు. ఇప్పటివరకు ఈ వేరియంట్ బారిన పడిన ప్రజల్లో ”చాలా స్వల్ప స్థాయిలో కోవిడ్ లక్షణాలు” కనబడ్డాయి. ”చాలా మంది రోగులు ఒళ్లు నొప్పులు, విపరీతమైన అలసటతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. వారంతా కూడా యుక్త వయసులో ఉండి ఆసుపత్రిలో చేరని వారే”. ”ప్రమాదంలో ఉన్న వ్యక్తులపై కొత్త వేరియంట్ ప్రభావం తీవ్రతను అంచనా వేయడానికి ఇంకా సమయం పడుతుంది” అని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ కొత్త వేరియంట్‌ దక్షిణాఫ్రికా నుంచి చాలా దేశాలకు వ్యాపించింది. అమెరికా, జర్మనీ, బెల్జియం, ఇజ్రాయెల్, బ్రిటన్, హాంకాంగ్, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా ఈ వైరస్‌ను గుర్తించారు. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి భారత్‌ వచ్చిన కొందరికి కూడా కరోనా సోకినట్లు తేలింది. కానీ వారికి సోకింది ఒమిక్రాన్ వేరియంటా కాదా అన్నది తెలుసుకోవడానికి జీనోమ్ సీక్వెన్స్ కోసం శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. ”మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ చాలా భిన్నమైనది. ఇది అసాధారమైన మ్యుటేషన్ల సమూహాన్ని కలిగి ఉంటుంది” అని దక్షిణాఫ్రికాలోని సెంటర్ ఫర్ ఎపిడెమిక్ రెస్పాన్స్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్, ప్రొఫెసర్ టులియో డి ఓలివెరా వివరించారు. ”ఈ వేరియంట్ మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా వైరస్‌లో వచ్చే మార్పుల ప్రకారం, మేం ఊహిస్తున్న దాని ప్రకారం చూస్తే ఇది చాలా వేగంగా రూపాంతరం చెందుతోంది” అని ఆయన చెప్పారు.

ఒమిక్రాన్‌లో మొత్తం 50 మ్యుటేషన్లు ఉన్నాయి. ఇందులో 30 మ్యుటేషన్లు స్పైక్ ప్రోటీన్‌లో సంభవించాయి”. ”మన శరీరంలోని కణాలతో ఈ వైరస్ సంబంధం ఏర్పరచుకునే అంశం గురించి మాట్లాడాలంటే ఇది 10 మ్యుటేషన్లను ఉపయోగించుకుంటుంది. డెల్టా వైరస్‌లోని 2 మ్యుటేషన్లే ప్రపంచవ్యాప్తంగా వినాశనానికి కారణమయ్యాయి” అని ఆయన వివరించారు. ”కొత్త వేరియంట్లు కనుగొన్నారంటూ వచ్చిన వార్తలు ప్రమాదాన్ని సూచించాయి. కానీ వ్యాధి తీవ్రతను, కోవిడ్ వ్యాక్సీన్లు నిరోధించగలవు” అని అమెరికాలోని అంటు రోగాల ఆసుపత్రి చీఫ్, డాక్టర్ ఆంథోని ఫౌచీ అన్నారు. ”ఒక సరైన పరీక్ష ఉంటే తప్ప, అది వైరస్ నుంచి మనల్ని రక్షించే యాంటీబాడీలపై ప్రభావం చూపుతుందో లేదో మనకు తెలియదు” అని ఆయన సీఎన్‌ఎన్‌తో చెప్పారు. అన్ని మ్యుటేషన్లు ప్రమాదకరమైనవి కావు. కానీ వైరస్‌లో ఎలాంటి మ్యుటేషన్లు సంభవించాయో తెలుసుకోవడం ముఖ్యం. చైనాలోని వూహాన్‌కు చెందిన వైరస్ కన్నా తాజా వైరస్ భిన్నంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అంటే వూహాన్ వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన వ్యాక్సీలన్నీ ఈ వైరస్‌పై సమర్థంగా పనిచేయకపోవచ్చు. ఇతర వేరియంట్లలో కూడా కొన్ని మ్యుటేషన్లను కనుగొన్నారు. ఆ వేరియంట్‌లో తమ పాత్రకు సంబంధించిన సమాచారాన్ని ఆ మ్యుటేషన్లు అందించాయి. కరోనావైరస్ కొత్త వేరియంట్ పేరు ‘ఒమిక్రాన్‌’, ఆందోళనకరంగా ఉందన్న డబ్ల్యూహెచ్‌వో ఆందోళన రేకెత్తిస్తున్న అత్యంత ప్రమాదకరమైన కొత్త కరోనా వేరియంట్ B.1.1.529

ఎన్501వై అనే మ్యుటేషన్ సులువుగా కరోనావైరస్ వ్యాప్తి చెందేలా చేస్తుంది. మరికొన్ని మ్యుటేషన్లు, శరీరంలో వైరస్‌ను గుర్తించడంలో యాంటీబాడీల పనిని కష్టతరం చేస్తాయి. వ్యాక్సీన్ల ప్రభావాన్ని తగ్గిస్తాయి. కొన్ని మ్యుటేషన్లు మరింత భిన్నంగా ప్రవర్తిస్తాయి. ”ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వైరస్ వ్యాపించే సామర్థ్యాన్ని ఈ వేరియంట్ పెంచుతుందేమో అని మాకు ఆందోళనగా ఉంది. రోగనిరోధక వ్యవస్థ నుంచి కూడా తప్పించుకోవచ్చు” అని దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నటాల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రిచర్డ్ లెసెల్స్ అన్నారు.