సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి మరొక ఘనత సాధించింది. ప్రభుత్వ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు గాంధీ ఆసుపత్రిని కేంద్రం ఎంపిక చేసింది. ఐసీఎంఆర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ రీసెర్చ్‌(డీహెచ్‌ఆర్‌) అభివృద్ధి చేస్తున్న ‘ఇండియన్‌ క్లినికల్‌ ట్రయల్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ నెట్‌వర్క్‌’ (ఐఎన్‌టీఈఎన్‌టీ-ఇంటెంట్‌)కు గాంధీ ఆసుపత్రి ఎంపికైంది.

దక్షిణాది రాష్ట్రాలకు ‘రీజినల్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ యూనిట్‌’గా ఎంపికై రికార్డులకెక్కింది. దేశంలో ఆరోగ్య సంరక్షణ కోసం పాలసీలు, కార్యక్రమాల రూపకల్పనకు కావాల్సిన ఆధారాలను క్లినికల్‌ ట్రయల్స్‌, ఇతర పరిశోధనల ద్వారా తయారుచేయడానికి ఐసీఎంఆర్‌, డీహెచ్‌ఆర్‌ సంయుక్తంగా ‘ఇంటెంట్‌’ పేరుతో నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ఆసక్తి కలిగిన ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు ఇందులో భాగస్వామి కావాలంటూ ఐసీఎంఆర్‌ ఇటీవల దరఖాస్తులు కోరింది.

అన్ని అర్హతలను పరిశీలించిన అనంతరం గాంధీ ఆసుపత్రిని దక్షిణాదికి ‘రీజినల్‌ క్లినికల్‌ ట్రయల్‌ యూనిట్‌’ (ఆర్‌సీటీయూ)గా ఎంపిక చేసింది. దీంతో ఇకపై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే క్లినికల్‌ ట్రయల్స్‌ గాంధీ ఆసుపత్రి లో కూడా జరుగుతాయి. ‘మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్‌ యూనిట్‌’ ఉన్న మెడికల్‌ కాలేజీలు మాత్రమే క్లినికల్‌ ట్రయల్‌ యూనిట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి కూడా దరఖాస్తు చేసుకుంది.

గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక ఎండీఆర్‌యూ ఉన్నది. రూ.5 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. మరికొన్ని త్వరలో అందుబాటులోకి రానున్నాయి. బయోకెమిస్ట్రీ, పాథాలజీ, జెనెటిక్స్‌ వంటి పరిశోధనలకు ఈ యూనిట్‌లో పరికరాలు ఉన్నాయి. దీనికి డాక్టర్‌ కే నాగమణి నోడల్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇందులో ఇద్దరు డిప్యూటీ నోడల్‌ ఆఫీసర్లు డాక్టర్‌ త్రిలోక్‌ చందర్‌, పద్మ సునేత్రి, ఇద్దరు సైంటిస్టులు మాధవీ లత, విన్నీ థామస్‌ పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ యూనిట్‌లో 27 ఫ్యాకల్టీ రీసెర్చ్‌ ప్రాజెక్టులు నడుస్తుండగా దాదాపు 17 పూర్తై మరో 10 తుది దశకు చేరాయి. ఈ వివరాలన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అనంతరం ఐసీఎంఆర్‌ గాంధీ ఆసుపత్రిని రీజినల్‌ సెంటర్‌గా ఎంపిక చేసింది.