దుంపల్లో ఒకటైన చామ దుంప గురించి అందరికి తెలిసిందే! చామ దుంపలను కాల్చుకుని, ఉడుకించుకుని, వేపుడుగా, పులుపు ఇలా రకరకాలు తయారు చేసుకుని తినొచ్చు. కానీ చామ దుంపను పిల్లలే కాదు పెద్దలు కూడా ఎక్కువమంది ఇష్టపడరు. ఎందుకంటే, చామ దుంప కాస్త జిగురుగా ఉంటుంది. దాంతో చామ దుంపను వండుకుని తినడానికి చాలా మంది సంకోచిస్తుంటారు. కానీ, చామ దుంపలో ఉండే పోషక విలవలు తెలిస్తే ఖచ్చితంగా దాన్ని తినేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి, ఆలస్యం చేయకుండా చామ దుంపలో దాగున్న ఆరోగ్య రహస్యాలను మీరు కూడా చూసెయ్యండి.

పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే చామ దుంపలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించేసి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దాంతో గుండె పోటు, ఇతర గుండె జబ్బులు రాకుండా రక్షణ లభిస్తుంది. అలాగే కావల్సిన పోషకాలను అందించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పడేలా చేస్తుంది. అలాగే మధుమేహం ఉన్న వారు చామ దుంప తింటే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఎందుకంటే, చామ దుంప తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ఎప్పుడూ అదుపులో ఉంటాయట. ప్రెగ్నెన్సీ సమయంలో వికారం, వాంతులు తెగ ఇబ్బంది పెడతాయి. అయితే చామ దుంపు తీసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చామ దుంపల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, తరచూ చామ దుంపలు తీసుకుంటే మలబద్ధకం సమస్య దూరం అవ్వడంతో పాటు జీర్ణ వ్యవస్థ చురుగ్గా పని చేస్తుంది.

ఇక ఫైబర్ ఉండే ఏ ఆహారమైనా బరువును తగ్గిస్తాయి. కాబట్టి, అధిక బరువు తగ్గాలి అని ప్రయత్నించే వారు చామ దుంపులను డైట్‌లో చేర్చుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేవిధంగ నేటి కాలంలో చాలా మంది అధిక రక్త పోటుతో ఇబ్బంది పడుతున్నారు. అయితే అలాంటి వారు చాప దుంప తీసుకోవడం ద్వారా దానిలో ఉండే విటమిన్ బి6 రక్తపోటును అదుపులో ఉంచుతుంది.