తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ చూపిన చొరవతో హైదరాబాద్‌ నుంచి పుదుచ్చేరికి విమాన సర్వీసు పునః ప్రారంభం కానుంది. ఈ ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు పెరగడం ద్వారా టూరిజం అభివృద్ధి జరుగుతుందని గవర్నర్‌ ఎన్నోసార్లు రిక్వెస్ట్‌ చేయడంతో పౌర విమానయాన శాఖ సానుకూలంగా స్పందించింది.

కరోనా సంక్షోభం చుట్టుముట్టగానే లాక్‌డౌన్‌ అనివార్యంగా మారడంతో అందులో భాగంగా హైదరాబాద్‌ నగరం నుంచి 2020 మార్చి 24 నుంచి అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఆ తర్వాత క్రమంగా కొన్ని సర్వీసులు స్టార్‌ అయ్యాయి కానీ హైదరాబాద్‌ నుంచి పుదుచ్చేరికి నడిచే ప్లైట్‌ పునః ప్రారంభానికి నోచుకోలేదు. ఈ సర్వీసుతో నష్టాలు వస్తుండటంతో ఎయిర్‌ ఆపరేటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్‌ పుదుచ్చేరిల మధ్య విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే ఇరు రాష్ట్రాల్లో టూరిజం సెక్టార్‌ మేలు జరుగుతుందంటూ కేంద్రాన్ని గవర్నర్‌ తమిళసై కోరారు. పుదుచ్చెరికి సమీపంలో ఉన్న వెలాంగిని చర్చ్‌, నాగోర్‌ దర్గా, తిరునల్లార్‌ శనీశ్వరాలయం, మహాబలిపురం వంటి ప్రాంతాలకు వెళ్లే వారికి అనుకూలంగా ఉంటుందంటూ విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు లేఖ రాయడంతో రంగంలోకి దిగిన ఏవియేషన్‌ శాఖ ఎయిర్‌ ఆపరేటర్లతో చర్చించి హైదరాబాద్‌ – పుదుచ్చేరి సర్వీసు బ్రేక్‌ ఈవెన్‌ సాధించే వరకు వ్యాయబులిటీ గ్యాప్‌ ఫండ్‌ (వీజీఎఫ్‌) సర్థుబాటు చేస్తామంటూ హమీ ఇచ్చింది. దీంతో ఈ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు స్పైస్‌జెట్‌ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది.