హైద‌రాబాద్ మెట్రో రైలు ఒక గొప్ప కార్యానికి ఉప‌యోగ‌ప‌డింది. నిత్యం ప్ర‌యాణికుల‌ను త‌ర‌లిస్తూ న‌గ‌రంపై ట్రాఫిక్ భారాన్ని త‌గ్గించే మెట్రో రైలు మొద‌టిసారి ఒక గుండెను త‌ర‌లించింది. ఒక ప్రాణాన్ని కాపాడింది. వివ‌రాల్లోకి వెళ్తే… జూబ్లిహిల్స్ అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్య‌క్తి ప్రాణాలు కాపాడాలంటే గుండె మార్పిడి చేయాలి. న‌ల్గొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు ప్ర‌మాద‌వ‌శాత్తూ గాయ‌ప‌డి బ్రెయిన్ డెడ్‌కు గుర‌య్యాడు. ఒక ప్రాణాన్ని నిలిపేందుకు ఆయ‌న గుండెను దానం చేయ‌డానికి స‌ద‌రు రైతు కుటుంబ సభ్యులు అంగీక‌రించారు.

దీంతో ఎల్‌బీన‌గ‌ర్ కామినేని ఆసుప‌త్రిలో ఇవాళ ఉద‌యం వైద్యులు గుండెను సేక‌రించారు. అత్యంత వేగంగా జూబ్లీహిల్స్ అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించి గుండెమార్పిడి చేస్తేనే ఫ‌లితం ఉంటుంది. న‌గ‌ర రోడ్ల‌లో ట్రాఫిక్ బెడ‌ద ఎక్కువ‌. గ్రీన్ ఛాన‌ల్ పెట్టి వాహ‌నాల‌ను నిలిపేసి గుండెను రోడ్డుపై త‌ర‌లించ‌డం వ‌ల్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్ప‌డుతుంది.

అందుకే మొద‌టిసారి గుండెను త‌ర‌లించ‌డానికి మెట్రో రైలును ఉప‌యోగించారు. ఎల్‌బీన‌గ‌ర్ కామినేని ఆసుప‌త్రి నుంచి ఆంబులెన్స్‌లో నాగోల్ మెట్రో స్టేష‌న్‌కు త‌ర‌లించి అక్క‌డి నుంచి ప్ర‌త్యేక మెట్రో రైలులో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ స్టేష‌న్‌ వ‌ర‌కు తీసుకెళ్లారు. అక్క‌డి నుంచి మ‌ళ్లీ గుండెను ఆంబులెన్స్‌లో అపోలో ఆసుప‌త్రికి తీసుకెళ్లి ఆప‌రేష‌న్ పూర్తి చేశారు.