పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను ఒప్పుకోవడంతో ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. ఒకవైపు వకీల్ సాబ్ షూటింగ్ జరుగుతుండగానే అయ్యప్పనుం కోషియుం సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రానాతో కలిసి మల్టీస్టారర్‌గా పవన్ నటిస్తున్న ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పవన్ 26వ సినిమా. దీని తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 27వ సినిమా ఉంటుంది.
ఇది పీరియాడికల్ మూవీ. ఇటువంటి సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు క్రిష్ దిట్టగా చెప్పొచ్చు. దీంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లుగా ఈ సినిమాకు ఓం శివమ్, విరూపాక్ష, గజదొంగ వంటి టైటిళ్లను పరిశీలించారు. చివరకు ఇప్పుడు హరిహర వీరమల్లు అనే టైటిల్‌ని ఫైనల్ చేశారని తెలుస్తోంది.
కాగా, ఈ సినిమాలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొన్ని దశాబ్దాల వెనుక రాబిన్ హుడ్ మాదిరిగా వజ్రాలను దొంగలించి పేదవారిని ఆదుకున్న ఒక వజ్రపు దొంగ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారనేది మాత్రం ఖాయంగా తెలుస్తోంది. పవన్ గెటప్ కూడా కొత్తగా ఉండనుంది.