హరియాణాలోని కర్నాల్‌ ప్రాంతంలో ఒకే పాఠశాలలో 54 మంది విద్యార్థులకు కరోనా సోకింది. అదే పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఇటీవల అనారోగ్యానికి గురి కాగా, సోమవారం వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపట్టి విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు జరిపితే 54 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో పాఠశాల వసతిగృహాన్ని అధికారులు మూసివేసి ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్ ‌ జోన్‌గా ప్రకటించారు.

హరియాణాలో గతేడాది డిసెంబరు నుంచి 9-12 తరగతి విద్యార్థులకు మాత్రమే స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మిగతా తరగతుల వారికి కూడా స్కూళ్ళు
ప్రారంభించారు. అయితే పాఠశాలకు హాజరవడం అన్నది తప్పనిసరి కాదు. కావాలనుకుంటే ఆన్‌లైన్‌ క్లాసులను కూడా కొనసాగించొచ్చని అక్కడి ప్రభుత్వం వెసలుబాటు కల్పించింది. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన కారణంగా చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభించాయి. కానీ కొన్ని చోట్ల నిబంధనలు అమలు సరిగా లేకపోవడంతో స్కూళ్లు వైరస్‌ హాట్‌స్పాట్లుగామారిపోవడంతో గత నెల కేరళలోని మలప్పురంలో గల పాఠశాలలో 192 మంది పదో తరగతి విద్యార్థులకు వైరస్‌ సోకింది.ఇంకా చాలా చోట్ల ఇలా జరగడం ఆందోళన కలిగించే విషయం.