ఏదైనా ప్రమాదం జరిగితే వారికి ఆర్థికంగా అండగా ఉంటుందనే ఆశతో బీమా చేయించుకుంటుంటారు. కానీ ఆ బీమా కాసుల కోసం కక్కుర్తి పడి ఏకంగా మనుషులు ప్రాణాల్నే తీసేస్తున్న ముఠాలు చాలానే ఉన్నాయి.భీమా నామినీలతో ఒప్పందాలు కుదుర్చుకుని బీమా చేయించుకున్న వ్యక్తుల్ని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. అలా ఇప్పటి వరకూ ఆ ముఠా ఐదుగురు వ్యక్తుల్ని హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముఠాలలో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబడుతున్నారు. అలా ఇప్పటి వరకూ 17మందిని అదుపులోకి తీసుకోగా తేలిన విషయం ఈ బీమా డబ్బుల్ని కాజేస్తున్న ముఠా టార్గెట్ గిరిజనులే !

ఈ ముథ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఎంచుకుని బలవంతంగా బీమా చేయించి ఆ తరువాత వారిని హత్యచేసి బీమా సొమ్మును కొట్టేస్తుంది. డబ్బుల కోసం ఈ ముఠా ఏకంగా ఐదారుగురిని హత్య చేసిన విషయం తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. డబ్బుల కోసం ఇంతటి దారుణాలకు తెగబడుతున్న ముఠా ఆ వివరాలు ఒక్కొక్కటి వివరిస్తుంటే పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.

గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను ముందే సేకరించిన తరువాత ముఠా సభ్యులు రంగంలోకి దిగుతారు. వారి కుటుంబ సభ్యులను కలిసి బీమా కట్టేలా ఒప్పించి ఒకటి రెండు ప్రీమియంలను ముఠా సభ్యులే కడతారు. ఆ తర్వాత ముఠా సభ్యులు తమ పక్కా ప్లాన్ ను అమలు చేసేందుకు రంగంలోకి దిగుతారు. బీమా చేయించుకున్న వ్యక్తి నామినీతో ఒప్పందం కుదుర్చుకుని, వారు ఒప్పుకోకపోతే
పదే పదే నచ్చచెప్పి మీరు పైసా కట్టలేదు పైగా మీకు లక్షల రూపాయలు వస్తాయి. సదరు బీమా చేయించుకున్న వ్యక్తి బతికి ఉన్నాకూడా అంత డబ్బు ఎప్పటికి సంపాదించలేడు. ఆ డబ్బు మీ కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది అంటూ పలు రకాలుగా నచ్చచెబుతారు. అప్పుడు కూడా లొంగకపోతే బెదిరిస్తారు. బీడీరించి తమదారికి తెచ్చుకుంటారు.

అనంతరం ఆ బీమా తీసుకున్న వ్యక్తిని హత్య చేసి రోడ్డు మీదకు తెచ్చి పడేసి, ఆ తరువాత ఏదోక వాహనంతో గుద్దించి రోడ్డు ప్రమాదంగా క్రియేట్ చేసి ఆపై ఎఫ్ఐఆర్ కాపీ సేకరించి బీమాకు క్లెయిమ్ చేసి వచ్చిన మొత్తంలో కుటుంబసభ్యులకు 20 శాతం ఇచ్చి మిగతా మొత్తాన్ని ముఠా సభ్యులు అందరూ కలిసి పంచుకుంటారు. ఇలా ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు క్లెయిమ్ చేసినట్టుగా పోలీసులు విచారణలో తెలుసుకున్నారు.

దామచర్ల మండలంలోని ఓ గిరిజన తండాకు చెందిన ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించి గత కొన్నేళ్లుగా ఈ హత్యలు చేస్తున్నారని, దీనికి సహకరిస్తున్న 17 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒక ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఏజెంట్‌ కోసం గాలిస్తున్నారు.

దామచర్ల మండలంలోని కొండ్రపోల్‌కు చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి మృతదేహం వారం క్రితం నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి పక్కన కనిపించగా ట్రాక్టర్ ఢీకొట్టడం వల్లే ఆయన మరణించాడని కుటుంబ సభ్యులను అతని భార్య నమ్మించింది. కానీ అంత్యక్రియలకు హాజరైన సమయంలో కోటిరెడ్డి తల్లిదండ్రులు అతని శరీరంపై గాయాలను అనుమానపడ్డారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కోటిరెడ్డి భార్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో బీమా కోసమే ఇలా చేసానని, కొంతమంది తనను ఒప్పించి ఇలా చేశారని తెలియడంతో ఈ బీమా దందా వెలుగులోకి వచ్చింది. ఒకటి రెండు రోజులలో నిందితులను రిమాండ్కు పంపనున్నట్టు పోలీసులు చెప్పారు.