కడప రాజారెడ్డి వీధిలో నివసిస్తున్న న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు పి. సుబ్రమణ్య శెట్టి రాత్రి తన ఇంటి నుంచి పాత అపార్ట్‌మెంట్‌కు వెళ్లి పొద్దు పోయినా ఇంటికి రాలేదు. మొబైల్ కూడా స్విచాఫ్ అని రావడంతో వారు ఆందోళన చెంది వన్‌ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించగా సుబ్రమణ్యం పాత అపార్ట్‌మెంట్ దగ్గరకు వెళ్లినట్లు తెలుసుకున్నారు. అక్కడ అతడి చెప్పులు కనిపించినా మనిషి కనిపించకపోవడంతో సమీపంలో కూడా గాలించారు. అక్కడ అపార్ట్‌మెంట్ కింద సుబ్రమణ్యం రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. లాయర్ ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. మృతుడు గతంలో శిల్ప అపార్ట్‌మెంట్‌లో నాలుగో అంతస్తులో నివాసం ఉండేవారు. అయితే ఈ మధ్యే అదే అపార్ట్‌మెంట్ పక్క వీధిలో సొంతగా ఇల్లు కట్టుకున్నారు. ప్రస్తుతం అక్కడే నివసిస్తున్నారు.