కరీంనగర్ జిల్లాలో మానకొండూర్ మండలం జగ్గయ్యపల్లి-లింగాపూర్ గ్రామాల మధ్య నడిరోడ్డుపై మంగళవారం లారీ, లారీతో పాటు లారీలో ఉన్న కాంక్రిట్ మిక్సర్ మిషన్ కాలిబూడిదయిపోయింది. గ్రానైట్‌ను సప్లై చేసే లారీలో కరీంనగర్ నుంచి లింగాపూర్‌కు కాంక్రీట్ మిక్సర్ మిషన్ తీసుకెళ్తుండగా పైన కరెంటు వైర్లు తాకడంతో మంటలు చెలరేగగా వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్ బండిని ఆపి కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగి మిక్సర్ కాలి రోడ్డు పక్కనే ఉన్న పంట పొలాల్లో పడి లారీ క్యాబిన్‌తోపాటు టైర్లు కూడా కాలిపోయాయి. లింగాపూర్‌లో చెక్ డ్యామ్ నిర్మాణానికి కాంట్రాక్టర్ లారీలో కాంక్రిట్ మిక్సర్ మిషన్ తీసుకెళ్తుండగా ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది వేగంగా వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే మిక్సర్ మొత్తం కాలి బూడిద అయింది. లారీ కూడా పాక్షికంగా దెబ్బతినేసింది. నడిరోడ్డుపై అగ్ని ప్రమాదం జరగడంతో ఆ దారిలో వెళ్లే వారు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో నష్టం భారీగానే ఉంటుందని భావిస్తున్నారు.