ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణికుల సౌకర్యం కోసం ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు లేదా విమానాశ్రయం నుంచి ఇంటికి ప్రయాణికులు తమ బ్యాగులు మోసుకెళ్లే బాధ లేకుండా ‘డోర్‌ టు డోర్‌ బ్యాగేజ్‌ ట్రాన్స్‌ఫర్‌’ సర్వీసులను ప్రారంభించింది. ప్రస్తుతం దిల్లీ, హైదరాబాద్‌లలో ఈ సేవలు అందుబాటులోకి రాగా త్వరలోనే ముంబయి, బెంగళూరులోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

వివరాలు మీకోసం:

ప్రముఖ ఆన్‌లైన్‌ లాజిస్టిక్‌ సేవల సంస్థ కార్టర్‌పోర్టర్‌ భాగస్వామ్యంతో ‘6EBagport’ పేరుతో ఇండిగో ఈ సేవలను ప్రారంభించింది. 6EBagportతో ప్రయాణికుల నుంచి బ్యాగేజీలు తీసుకుని భద్రంగా వారికి గమ్యస్థానానికి చేరుస్తామని ఎయిర్‌లైన్‌ తెలిపింది. ప్రయాణికులు తమ ఇంటి నుంచి ఎయిర్‌పోర్టు వరకు లేదా విమానాశ్రయం నుంచి ఇంటికి లగేజీని పంపించుకోవచ్చు. రూ. 630(ఒక ట్రాన్స్‌ఫర్‌కు) ప్రారంభ ధరతో బ్యాగేజీకి రూ. 5000 చొప్పున సర్వీసు ఇన్స్యూరెన్స్‌ కూడా ఇస్తున్నట్లు మరియు ట్రాకింగ్‌ సదుపాయం కూడా ఇస్తున్నట్టు వెల్లడించింది. దీంతో కస్టమర్లు తమ లగేజీ ఎక్కడిదాకా వచ్చిందో తెలుసుకోవచ్చు. విమానం బయల్దేరడానికి 24 గంటల ముందు వరకు, విమానం దిగిన తర్వాత ఎప్పుడైనా ఈ సేవలను వినియోగించుకోవచ్చని ఇండిగో తెలిపింది.