హైదరాబాద్ నిజాంపేట్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడిస్తున్న రెండు ప్రైవేటు ఆస్పత్రులను జిల్లా వైద్యాధికారులు డా. కె.మల్లికార్జున్‌రావు గురువారం సీజ్‌ చేశారు. ఈ రెండు ఆస్పత్రులు రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదని, అర్హతలేని వైద్యులతో చికిత్సలు చేయిస్తున్నారని, ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాగే అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మరికొన్ని ఆస్పత్రులు, క్లినిక్‌లు, డెంటల్‌ ఆస్పత్రులు, ఫిజియోథెరపి క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లను కూడా వారం రోజుల్లో మూసి వేస్తామని ఆయన తెలిపారు. ఈ లోపు అనుమతులు లేని ఆస్పత్రులు వెంటనే అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్‌ మీడియా అధికారి వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.