మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో ఇద్దరు చిన్నారులపై ఒక అమానవీయమైన దాడి జరిగింది. అసలేం జరిగిందంటే… మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులోని సాయి నగర్‌కు చెందిన ఇద్దరు మైనర్‌ బాలలు తమ పెంపుడుకుక్క కనబడకపోవడంతో దాన్ని వెతుక్కుంటూ కంటాయపాలెం రోడ్డుకు సమీపంలో ఉన్న ఓ మామిడి తోటలోకి వెళ్లారు. తోటకు కాపలాగా ఉంటున్న బానోత్‌ యాకుబ్, బానోత్‌ రాములు. వీరిని చూసి మామిడి కాయల దొంగతనానికి వచ్చారని అనుమానించి ఇద్దరినీ తాళ్లతో కట్టేసి కర్రతో తీవ్రంగా కొట్టారు. ఇద్దరి ముఖానికి పశువుల పేడను పూసి, వారితో తినిపించారు. ఆ దారిలో వెళ్తున్న ఒక వ్యక్తి ఈ ఘటనంతా వీడియో తీసి వాట్సాప్‌ గ్రూప్‌లలో పోస్ట్‌ చేయడంతో ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.