అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

సెమీస్‌కు భారత మహిళల హాకీ జట్టు!!

ఒలింపిక్స్‌లో హాకీ జట్టు వరుసగా పతకాలు కొల్లగొట్టిన ఘన చరిత్ర మనది. దిగ్గజాల నిష్క్రమణతో భారత హాకీ ప్రాభవం కోల్పోయి ఓటముల పరంపర వెక్కిరించింది. మధ్యలో కొందరు గొప్ప ఆటగాళ్లు అవతరించినా బృందంగా మాత్రంవిఫలమైంది. అలాంటిది మళ్లీ ఇన్నేళ్లకు భారత హాకీకి స్వర్ణయుగం రాబోతున్నట్టు అనిపిస్తోంది. 49 ఏళ్ల తర్వాత పురుషుల జట్టు ఒలింపిక్స్‌ సెమీస్‌లో అడుగుపెట్టగా అమ్మాయిల బృందం చరిత్రలోనే తొలిసారి సెమీస్‌ చేరుకుంది.

ఆస్ట్రేలియా అంతర్జాతీయ హాకీలో తిరుగులేని జట్టుగా పేరు పొందింది. మూడు సార్లు ఒలింపిక్స్‌ విజేత. ప్రపంచ రెండో ర్యాంకు దాని సొంతం. అలాంటి జట్టును క్వార్టర్‌ ఫైనల్లో రాణి రాంపాల్‌ సేన 1-0 తేడాతో ఓడించింది. ఈ విజయం అపూర్వం. అద్వితీయం అనడంలో సందేహమే లేదు. లీగ్‌ దశలో వరుసగా మ్యాచులు ఓడిన అమ్మాయిలు ఆపై వరుసగా విజయాల జైత్రయాత్ర చేయడం గర్వించ తగ్గ విషయం!

క్వార్టర్‌ ఫైనల్లో రెండు జట్లూ నువ్వానేనా అన్నట్టు ఆడి గట్టి పట్టుదల ప్రదర్శించాయి. ముఖ్యంగా భారత జట్టు తెగువను ఎంత అభినందించినా తక్కువే! దుర్భేద్యమైన డిఫెన్స్‌కు మారుపేరైన ఆసీస్‌పై రాణీ జట్టుకు లభించింది ఒకే ఒక్క పెనాల్టీ కార్నర్‌. 22వ నిమిషంలో దొరికిన బంగారు అవకాశాన్ని గుర్జీత్‌ కౌర్‌ ఒడిసిపట్టి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించి రెండో క్వార్టర్‌ ముగిసే సరికి 1-0తో భారత్‌కు ఆధిక్యం అందించింది.

ఆ తర్వాత వందనా కటారియా, నవనీత్‌ కౌర్‌, రాణి రాంపాల్‌, టెటె సలీమా గోల్స్‌ చేసేందుకు విపరీతంగా శ్రమించి ఆసీస్‌ గోల్‌ కీపర్‌ రేచల్‌ అన్‌ సహచరులతో కలిసి విజయవంతంగా వారిని అడ్డుకుంది. ఇక భారత గోల్‌కీపర్‌ సవిత గురించి ఎంత చెప్పినా తక్కువే! ఆసీస్‌ చేసిన 9 దాడులను సహచరులతో కలిసి ఆమె నిలువరించింది. ఏడు పెనాల్టీ కార్నర్లు, రెండు ఫీల్డ్‌ గోల్స్‌ను అడ్డుకున్న ఆమె టీమ్‌ఇండియా విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. బుధవారం జరిగే సెమీస్‌లో అర్జెంటీనాతో భారత్‌ తలపడనుండగా అందులో గెలిస్తే హాకీ చరిత్ర మలుపు తిరగడం తథ్యం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •