ఒమిక్రాన్‌ ప్రభావం ఇప్పుడు భారత్‌పై కూడా పడింది. ఆఫ్రికా దేశాల నుంచి ఇటీవల భారత్‌కు వచ్చినవారిలో చాలామంది ఆచూకీ దొరకట్లేదు ఎందుకంటే పాస్‌పోర్టుల్లో పేర్కొన్న చిరునామాల్లో వారు ఉండడంలేదు. వీరి ద్వారా కొత్త వేరియంట్‌ స్థానికంగా వ్యాపించే ముప్పు ఉండడంతో అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు.

ఆఫ్రికా దేశాల నుంచి గత 15 రోజుల్లో సుమారు వెయ్యి మంది ముంబయికి చేరుకోగా వీరిలో 466 మందిని గుర్తించామని ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. ఆఫ్రికా దేశాల నుంచి ఇటీవల బిహార్‌కు వచ్చిన 281 మందిలో సుమారు 100 మంది కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించేందుకు నాలుగు విమానాశ్రయాల్లో ఆరోగ్య సిబ్బందిని మోహరించారు. అంతే కాకుండా వీరికి క్వారంటైన్‌ను తప్పనిసరి చేశారు. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చి పాజిటివ్‌గా తేలిన ఓ వ్యక్తికి ఏ వేరియంట్‌ సోకిందో ఇంకా తెలియలేదు. ఇంకా జీనోమ్‌ విశ్లేషణ ఫలితాల కోసం అధికారులు నిరీక్షిస్తూనే ఉన్నారు.