యావత్‌ ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ కేసుల్ని భారత్‌లోనూ గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. విదేశాల నుంచి కర్ణాటక వచ్చిన ఇద్దరు పురుషుల్లో ఈ వేరియంట్‌ బయటపడినట్లు, వీరిలో ఒకరి వయసు 66ఏళ్లు కాగా మరొకరి వయసు 46 ఏళ్లు ఉన్నాయి. కర్ణాటకకు వచ్చిన వీరిద్దరికీ తొలుత కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ విశ్లేషణ కోసం పంపించగా వారిద్దరిలో ఒమిక్రాన్‌ ఉన్నట్టు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జోనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) నిర్ధారించింది. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించామనీ, వారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది.

ఒమిక్రాన్‌ వెలుగుచూసిన ఇద్దరిలోనూ తీవ్రమైన లక్షణాలేమీ కనిపించలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవగాహన, అప్రమత్తత అత్యవసరమని, మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం మరవొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. అందరూ తప్పనిసరిగా రెండు డోసుల టీకాలు తీసుకోవాలని కోరారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం 37 ప్రయోగ శాలలు ఏర్పాటు చేసినట్టు, ఒమిక్రాన్‌ ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీ-పీసీఆర్‌ తప్పనిసరి చేసినట్టు తెలిపారు. ఈ పరీక్షల్లో పాజిటివ్‌ వస్తే ప్రత్యేక చికిత్సకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినా సరే వారం రోజుల పాటు క్వారంటైన్‌లోనే ఉంచనున్నట్టు తెలిపారు.

ఇదిలా ఉండగా ఒమిక్రాన్‌ వేరియంట్ క్రమంగా వ్యాపిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించాలని, మాస్క్‌ ధరించకుంటే వెయ్యి రూపాయల జరిమానాను విధించనున్నట్లు తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తాజాగా ఉత్తర్వులను జారీచేసారు. ఒమిక్రాన్‌ వైరస్‌ ఇప్పటికే 20కి పైగా దేశాలలో వ్యాపించిన సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో, ఆఫీసుల్లో మాస్క్‌ నిబంధన అమలయ్యేలా చూడాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది.

రిస్క్‌ ఉన్న దేశాల నుంచి హైదరాబాద్‌ వచ్చిన 325 మంది ప్రయాణికులకు పరీక్షలు చేయగా వీరిలో 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌ రాగా ఆమెకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. మరియు జీనోమ్‌ సిక్వెన్స్‌కి నమునాలు కూడా పంపించామని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు ప్రజలందరు తప్పకుండా మాస్క్‌ ధరించి, కరోనా నిబంధనలు విధిగా పాటించాలని సూచించారు.