ఏపీ ప్రభుత్వం డబ్బుల కోసం పేదలపై ఒత్తిడి తెస్తుంది. ”అప్పుడెప్పుడో ఇచ్చిన పాత ఇళ్లకు కొత్తగా వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) డబ్బులు చెల్లించకుంటే పెన్షన్‌కు కోతపెడతామని హెచ్చరిస్తోంది. ‘డబ్బులు కడతారా… పింఛను ఆపేయమంటారా’ అంటూ వలంటీర్లు, సచివాలయ సిబ్బంది చేస్తున్న ఒత్తిడితో పేదలు తల్లడిల్లుతున్నారు. ఈ గవర్నమెంట్ కొత్తగా ఒక్క ఇల్లూ కట్టలేదు. చంద్రబాబు హయాంలో కట్టిన, నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న ‘టిడ్కో’ ఇళ్లనూ లబ్ధిదారులకు పంపిణీ చేయకపోయినా కానీ ఎప్పుడో ఎన్టీఆర్‌ కాలం నుంచి బలహీన వర్గాలకు కేటాయించిన పేదల ఇళ్లపై ఈ ప్రభుత్వం దండయాత్ర చేస్తోంది.

ఈ ప్రభుత్వానికి అన్నిరకాలుగా పైకం తిరిగి రాబట్టుకోవడంలో మంచి అనుభవం ఉంది. అందుకే గత నాలుగు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వమూ పట్టించుకోని ‘బకాయిల’ కోసం వేట మొదలు పెట్టింది. పైగా అసలు ప్రస్తుత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేని దీనికి ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ అని ముద్దుగా ఒక పేరు పెట్టి, వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) కింద రూ.10 వేల నుంచి 15 వేలు కట్టాలని ఒత్తిడి చేస్తోంది. ఆ విషయం ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకోవడంతో ఓటీఎస్‌ కింద డబ్బులు కడితేనే సామాజిక పింఛను చెల్లించాలని, లేకపోతే కోత పెట్టాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.

”రాష్ట్రంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో ఓటీఎస్‌ చేసుకుంటేనే ఇక పెన్షన్‌ చెల్లించండి. పెన్షన్‌దారుల కుటుంబాలకు చెందిన వారెవరైనా గతంలో ప్రభుత్వ హౌసింగ్‌ పథకం ద్వారా గ్రామాల్లో ఇల్లు నిర్మించుకుని ఉంటే వాళ్లు రూ.10 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. అలా చేయించుకోకపోతే అలాంటి వారికి డిసెంబరు పెన్షన్‌ ఇవ్వొద్దు” అని రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు వలంటీర్లను ఆదేశించారు. దీనికి తోడు ఇవి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలని, వీటిని బేఖాతరు చేస్తే సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆ మొత్తాన్ని సిబ్బంది నుంచి రాబడతామని కూడా హెచ్చరించారు.