ట్విటర్‌కు కొత్త సీఈవో వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే! అయితే కొత్త సీఈవో వచ్చిన సందర్భంగా సంస్థ నూతన నిబంధనను ప్రవేశపెడుతూ నెట్వర్క్ పాలసీల్లో భాగంగా ఇతరుల ప్రైవేటు ఫోటోలను వారి అనుమతి లేకుండా షేర్ చేయడాన్ని బ్లాక్ చేసింది. ట్విటర్‌కు సీఈవో మారిన ఒక రోజులోనే ఈ కీలక మార్పు జరగడం హర్షణీయం.

ఈ కొత్త నిబంధనల్లో భాగంగా పబ్లిక్ ఫిగర్స్ కాని వ్యక్తులకు సంబంధించిన వారి ఫోటోలను వారి అనుమతి లేకుండా ఎవరైనా పోస్ట్ చేసినట్లు గుర్తిస్తే ఆ చిత్రాలు లేదా వీడియోలను తొలగించేలా ట్విటర్‌ని అభ్యర్దించవచ్చు. అక్కడే ఉండే రిపోర్ట్ అనే ఆప్షన్ ద్వారా ఇది పని చేస్తుంది. ఈ తాజా నిబంధన అనేది పబ్లిక్ ఫిగర్స్‌ లేదా సెలబ్రిటీలుగా వెలుగొందే వారి విషయంలో వర్తించదు. మరియు ప్రజా ప్రయోజనార్థం మీడియా సంస్థలు దాన్ని ఉపయోగించడం లేదా ఎంబేడ్ చేసే సందర్భాల్లో కూడా ఈ నిబంధన వర్తించబోదని స్పష్టం చేసింది.

యూజర్లు తమకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలు లేదా సమాచారాన్ని.. ఎవరైనా థర్డ్ పార్టీ వ్యక్తులు ప్రత్యేకించి హానికర ఉద్దేశంతో రీ పోస్ట్ చేయడం అనేది ఒక సమస్యగా మారింది. ఏళ్ల తరబడి దీనికి పరిష్కారం లేదు. ట్విటర్ ఇప్పటికే ఒక వ్యక్తికి సంబంధించిన పర్సనల్ ఫోన్ నంబర్ లేదా అడ్రస్ వంటి ప్రైవేట్ సమాచారాన్ని ట్విటర్‌లో బహిర్గతం చేయడాన్ని నిషేధించింది. ఎందుకంటే ఆ సమాచారంతో ‘వేధింపులకు గురి చేయడం లేదా హాని తలపెట్టడం, భయపెట్టడం, వ్యక్తుల గుర్తింపులను బహిర్గతం చేయడం వంటి ఆందోళనలు ఉన్నాయని వెల్లడించింది.