ఏపీలో సంపూర్ణ గృహ హక్కు పథకం వివాదాస్పదంగా మారడంతో వైసీపీ ప్రభుత్వం దీన్ని స్వచ్చందంగా అమలు చేస్తున్నట్లు నొక్కివక్కాణిస్తుంది. కానీ క్షేత్రస్ధాయిలో మాత్రం లబ్దిదారులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. దీనిని సాకుగా చూపించి విపక్షాలు టార్గెట్ చేస్తుండడంతో ఇవాళ సీఎం జగన్ ఓటీఎస్ పథకంపై జరుగుతన్న దుష్ప్రచారంపై స్పందించారు.

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్‌)పై దుష్ప్రచారం చేసే వారిపై కఠినంగా ఉండాలని సీఎం వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశిస్తూ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని, ఓటీఎస్‌ పథకం ద్వారా లక్షలమంది పేదలకు లబ్ధి జరుగుతుందని, చట్టపరంగా హక్కులు దఖలుపడతాయని అన్నారు. ఎంతో మేలు జరిగే ఈ పథకంపట్ల దురుద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలని, లబ్ధిదారుల్లో సందేహాలు, అనుమానాలు ఉంటే అధికారులను ఒకటికి రెండుసార్లు అడిగి తెలుసుకోవాలని అన్నారు.

నిన్న ఉదయం సీఎం కార్యాలయ అధికారులతో జరిగిన సమావేశం సందర్భంగా ఈ పథకం ద్వారా వచ్చే లబ్ధిని, రిజిస్టర్‌ పత్రాల ద్వారా వారికి మాఫీ అవుతున్న అసలు, వడ్డీ వివరాలనుకూడా చూపించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం స్వచ్చందంగా ముందుకొచ్చే వారికే ఈ పథకం అమలు చేస్తామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్ధాయిలో మాత్రం అధికారుల తప్పిదాలతోనే ఇలాంటి ప్రచారం జరుగుతున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. అందుకే అధికారులకే సీఎం జగన్ ముందుగా హెచ్చరికలు చేసినట్లు, దాని ద్వారా విపక్షాలను కూడా కట్టడి చేయాలని భావిస్తున్నారు.

మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా విపక్షాలు ఓటీఎస్ పథకంపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ ప్రజలు ఇలాంటి ప్రచారాన్ని నమ్మెద్దని సూచించారు. ఓటీఎస్ పథకాన్ని ప్రభుత్వం స్వచ్ఛందంగానే అమలు చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. టీడీపీ ప్రచారాలతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారే ప్రమాదం ఉందని, దీని పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో ఎయిడెడ్ స్కూళ్ల విలీనం సందర్భంగా కూడా ప్రభుత్వానికి ఇలాంటి పరిస్ధితే ఎదురయి, విలీనం స్వచ్చంధమని ప్రభుత్వం ఎంతగా చెప్పినా క్షేత్రస్ధాయిలో చోటు చేసుకున్న పరిణామాలతో తల్లితండ్రులు రోడ్లపైకి రాగా ఇప్పుడు మళ్ళీ అదే పరిస్ధితిని ప్రభుత్వం ఎదుర్కొంటోందని అన్నారు.