కరోనా వల్ల సామాన్యులతో పాటు ప్రముఖులకు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో పండుగలు ఉన్న నేపథ్యంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇటీవల ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం ఫిబ్రవరి రెండో వారంలో కేసులు జీవనకాల గరిష్ఠానికి చేరుతాయని తెలుస్తోంది. అంతర్జాతీయంగా కూడా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి.

కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ కు చెందిన ఓ ఔషధ సంస్థ టాబ్లెట్ ను రూపొందించింది. దీని ధర 63 రూపాయలుగా కంపెనీ పేర్కొంది. ఇటీవలే ఈ టాబ్లెట్ కు భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి ఆమోదం లభించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మోల్ను పిరావిర్ పేరుతో కరోనా వైరస్ కు విరుగుడుగా ఈ టాబ్లెట్ ను మార్కెట్లోకి తీసుకు రానున్నారు. ఈ టాబ్లెట్ ను హైదరాబాద్ కు చెందిన ఆప్టిమస్ అనే ఔషధ సంస్థ రూపొందించింది. ఈ మాత్ర టీకాలకు ఏ మాత్రం తీసిపోకుండా పనిచేస్తుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి నిర్వహించిన అన్ని క్లినికల్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఇప్పటికే మన దేశంలో వెలుగు చూసిన డెల్టా వేరియంట్ కు సంబంధించి ఈ టాబ్లెట్ మెరుగైన ఫలితాలను ఇస్తుందని స్పష్టం చేశారు.

వైరస్ ను అంతం చేయడం లో ఈ మోల్ను పిరావిర్ ఔషధం మరింత ఎక్కువ రేట్లు సామర్థ్యంతో పని చేస్తుందని క్లినికల్ పరీక్షల్లో తేలినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా దీనిని నోటి ద్వారా తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ టాబ్లెట్ ను ఉత్పత్తి చేసిన ఆప్టిమస్ అనే ఔషధ సంస్థ హైదరాబాద్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగానే మార్కెట్లోకి టాబ్లెట్ ను విడుదల చేస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.