భారత మొట్ట మొదటి ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తో పాటు మొత్తం 14 మంది దుర్మరణానికి కారణమైన ఐఏఎఫ్ హెలికాఫ్టర్ ఘటనపై త్రివిధ దళాల దర్యాప్తు పూర్తై ఈ నివేదికను చట్ట పరమైన సమీక్ష కోసం పంపినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత ఈ నివేదిక కేంద్రానికి సమర్పించనున్నారు.

త్రివిధ దళాల దర్యాప్తులో కనుగొన్న విషయాలు చట్టపరమైన పరిశీలన కోసం పంపగా వాటిని ఖరారు చేయడానికి 10 నుంచి 15 రోజుల సమయం పట్టనుంది. విచారణలో భాగంగా, ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR) అలాగే కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) రికవరీ చేశారు. దీంతో పాటు క్రాష్‌కు ముందు చివరి క్షణాలను రీకన్ స్ట్రక్ట్ విశ్లేషణ కోసం పంపారు. వీటి ఆధారంగా అత్యంత పేలవమైన వాతావరణ పరిస్ధితుల వల్ల హెలికాఫ్టర్ పైలట్ల నియంత్రణలో లేకుండా పోయిందని ఈ నివేదిక తేల్చినట్లు సమాచారం.

సీనియర్ పైలట్లు ఉన్నప్పటికీ, ప్రతికూల పరిస్ధితుల్లో వారు కూడా ఏమీ చేయడానికి లేకుండా పోయిందని దర్యాప్తు నివేదికలో తేలింది. హెలికాఫ్టర్ ప్రమాదానికి ఇదే ప్రధాన కారణంగా అర్ధమవుతోంది. దీన్ని ప్రస్తుతం చట్టపరమైన పరిశీలనకు పంపారు. అక్కడ తేలే అంశాలను కూడా కలిపి కేంద్రానికి త్రివిధ దళాల దర్యాప్తు కమిటీ నివేదించబోతోంది. ఆ తర్వాత కేంద్రం తదుపరి నిర్ణయం తీసుకోనుంది.

భారత వైమానిక దళం (IAF) Mi-17V5 హెలికాప్టర్ జనరల్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, అతని సిబ్బంది, పైలట్లు, సిబ్బందితో సహా మరో 12 మందితో డిసెంబరు 8న సూలూర్ నుండి వెల్లింగ్‌టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీకి వెళ్తుండగా కూలిపోయింది. తమిళనాడులోని నీలగిరి కొండల్లో గమ్యస్థానానికి దగ్గరగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ ట్రైనింగ్ కమాండ్ ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్ నేతృత్వంలోని ఐఏఎఫ్ త్రివిధ దళాల విచారణకు ఆదేశించింది. ఇందులో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మినహా మిగతా వాళ్లంతా అక్కడికక్కడే చనిపోగా వరుణ్ కూడా నాలుగు రోజుల తర్వాత బెంగళూరులో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.