ఒమిక్రాన్‌ వైరస్‌ రోజురోజుకు వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై 15-18 ఏళ్ల వయసున్న వారికి టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో సోమవారం నుంచి జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలుకానుంది. ఇప్పటివరకు 18 ఏళ్లు నిండిన వారికి టీకా ఇవ్వగా, 5.76 లక్షల మందికి తొలి డోసు, 4.27 లక్షల మందికి రెండో డోసు ఇచ్చారు. 15-18 ఏళ్లున్న వారు జిల్లాలో 40 వేల మందికి పైగా ఉంటారని అధికారులు అంచనా వేశారు. వీరు కొవిన్‌ యాప్‌లో స్లాట్‌ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే నేరుగా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి ఆధార్‌ కార్డు చూపించి పేరు నమోదు చేసుకుంటే టీకా ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లాలోని 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక పట్టణ ఆరోగ్యకేంద్రం, మెదక్‌, నర్సాపూర్‌ ప్రాంతీయ, తూప్రాన్‌, రామాయంపేట సామాజిక ఆసుపత్రుల్లో వైద్యారోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రస్తుతానికి కొవాగ్జిన్‌ వేసేందుకు అనుమతి వచ్చిందని, తొలి డోసు తీసుకున్నాక 28 రోజులకు రెండోది వేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు సూచించారు.