ఏపీ ప్రభుత్వంతో పేచీ నడుస్తున్నా కూడా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏ మాత్రం తగ్గడం లేదు. చెప్పినట్లుగానే ఆయన ఎన్నికల నిర్వహణకు సంబంధించి మరో కీలక ముందడుగు వేశారు. ఎన్నికల్లో అక్రమాలను నియంత్రించేందుకు గానూ ఆయన ఈవాచ్ అనే యాప్‌ను ఇవాళ ప్రారంభించారు. ఎన్నికల్లో అక్రమాలు, ప్రలోభాలు జరుగుతున్నట్లు తెలిస్తే, ఎవరైనా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు.
ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఫిర్యాదుపై చర్యలు తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని ఫిర్యాదుదారుడికి తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ యాప్‌కు అనుసంధానంగా కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. రేపటి నుంచి ప్లేస్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ యాప్ పూర్తి పారదర్శకంగా ఉంటుందన్నారు. పండుగలకు వచ్చినట్లుగా ప్రజలు స్వంత గ్రామాలకు వచ్చి ఓట్లేయాలని నిమ్మగడ్డ కోరారు.
ఇక ప్రభుత్వంపై కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఏకగ్రీవాలకు సంబంధించి ఇచ్చిన ప్రకటనలకు ఆధరణ లేదని చెప్పారు. ఏకగ్రీవాల సంఖ్య ఈసారి గణనీయంగా తగ్గిపోయిందన్నారు. కాగా, నిమ్మగడ్డ తయారుచేయించిన ఈ యాప్‌పై వైసీపీ గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాప్ పారదర్శకంగా లేదని వైసీపీ ఆరోపిస్తోంది.