కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గానే ఉంటారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూ ఇరుకున‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఒక్కోసారి ఈ ట్వీట్లు బాగా పేలుతాయి. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతులను నియంత్రించేందుకు ప్ర‌భుత్వం రోడ్డుపై భారీ ఎత్తున బ్యారీకెడ్లు నిర్మిస్తోంది. ఈ ఫోటోను ట్వీట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన రాహుల్ బ్యారీకెడ్లు కాదు, బ్రిడ్జిలు నిర్మించండి అని ఒకే మాట‌లో ప్ర‌భుత్వానికి అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చారు.

కానీ, అన్నిసార్లు ఇలా జ‌ర‌గ‌దు క‌దా. ఒక్కోసారి రాహుల్ ట్వీట్లు ఆయ‌న‌నే ఇబ్బంది పెడ‌తాయి. ఇవాళ ఆయ‌న చేసిన ట్వీట్ కూడా ఇలానే రివ‌ర్స్ కొట్టింది. ప్ర‌పంచంలో నియంతల పేర‌న్నీ ఎం అక్ష‌రంతోనే ఎందుకు ప్రారంభ‌మ‌వుతాయి అని రాహుల్ ప్ర‌శ్నించారు. ఇందుకు గానూ మార్కోస్, ముస్సోలినీ, మిలోసెవిక్, ముబారక్, మొబుటు, ముషారఫ్, మికోంబెరో పేర్ల‌ను ఉద‌హ‌రించారు. ఈ ట్వీట్ చాలా వేగంగా వైర‌ల్ అయిపోయింది.

ప్ర‌ధాని మోడీని ఇన్‌డైరెక్ట్‌గా విమ‌ర్శించేందుకు, ఆయ‌న నియంత అని చెప్పేందుకు రాహుల్ ఈ విమ‌ర్శ‌లు చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే, రాహుల్ ట్వీట్‌కు నెటిజ‌న్లు కౌంట‌ర్లు ఇచ్చారు. ప్ర‌ధాని పేరు మొద‌ల‌య్యేది ఎం అక్ష‌రంతో కాద‌ని, ఎన్ అక్ష‌రంతో అని కొంద‌రు ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌కు చెందిన మోతీలాల్ నెహ్రూ, మ‌న్మోహ‌న్ సింగ్ పేర్లు ఎం అక్ష‌రంతోనే మొద‌ల‌వుతాయ‌ని మ‌రికొంద‌రు రాహుల్‌కు గుర్తు చేశారు.