ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన జరుగుతోందని, దయచేసి జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు వినవించారు. ఇవాళ సాయంత్రం వారు అమిత్ షాను కలిసి ఏపీ వ్యవహారాలపై చర్చించారు. ఏపీలో వైసీపీ అరాచకం సృష్టిస్తోందని ఆరోపించారు. ఆలయాలపై ప్రభుత్వమే దాడులు చేయిస్తోందని, ప్రభుత్వ ప్రోత్సాహంతో మత మార్పిడులు జరుగుతున్నాయని ఎంపీలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని, భయానక వాతావరణం నెలకొందన్నారు. అందుకే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని, పెట్టుబడిదారులు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆరోపించారు.
మూడు రాజధానుల పేరుతో అమరావతిని దెబ్బ తీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎంపీలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఒక పెద్దన్న లాగా కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని వారు కోరారు. కాగా, 2019 పార్లమెంటు ఎన్నికల తర్వాత అమిత్ షాను టీడీపీ ఎంపీలు కలవడం ఇదే మొదటిసారి. టీడీపీ ఎంపీలకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో వారి ఫిర్యాదుపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.