మంగళవారం అమెరికా-మెక్సికో సరిహద్దు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడ్డారు. దక్షిణ కాలిఫోర్నియా- మెక్సికో సరిహద్దులోని స్టేట్‌ రూట్‌ 115, ఇంపీరియల్‌ కౌంటీలోని నోరిష్‌ రోడ్‌లో యూఎస్‌వీ కారును ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో 14 మంది అక్కడికక్కడే కన్నుమూయగా, మరొకరు ఆసుపత్రిలో చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నట్లు ఎల్ సెంట్రో రీజినల్ మెడికల్ సెంటర్ అత్యవసర విభాగం డైరెక్టర్ జూడీ క్రజ్ తెలిపారు.

ఎస్‌యూవీని ట్రక్కు ఎంత బలంగా ఢీకొట్టిందంటే అందులో చిక్కుకున్న వారి మృతదేహాలను వెలితీయడానికి కూడా చాలా శ్రమ పడవలసి వచ్చిందని అధికారులు తెలిపారు. 15 నుంచి 53 ఏళ్ల వయసున్న స్త్రీ, పురుషులు, డ్రైవర్‌ కూడా తీవ్ర గాయాలపాలైనట్టు వెల్లడించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు జాతీయ రవాణా భద్రతా బోర్డు వెల్లడించింది. కెపాసిటీకి మించి తీసుకు వెళుతూ ప్రమాదానికి గురైంది, సుమారు 27 మంది వరకు ఉన్నట్లు స్తానిక బోర్డర్ డివిజన్ చీఫ్ ఆర్టురో ప్లేటెరో పేర్కొన్నారు. మృతుల్లో పది మంది మెక్సికన్‌ పౌరులు ఉన్నారని, ఇతరుల వివరాలు ఇంకా తెలియవలసి ఉందన్నారు.