ప్రేమించిన యువతి కొద్ది కాలంగా పట్టించుకోకపోవడంతో ఆమెపై పగ పెంచుకుని కత్తితో దాడికి పాల్పడ్డాడొక ఉన్మాది. మంగళవారం ఈ సంఘటన గండిపేట మండలం హైదర్షాకోట్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. నార్సింగి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదర్షాకోట్‌కు చెందిన ఒక యువతి(29) సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తోంది. ఇక్కడ ఓ అంతర్జాతీయ క్షౌరశాలలో పనిచేస్తున్న హరియాణకి చెందిన షారూఖ్‌ సల్మాన్‌(29)తో ఆమెకు పరిచయం కాగా, ఇద్దరూ తరచూ కలుసుకునే వారు. సల్మాన్‌ అప్పుడప్పుడు ఇంటికి సైతం వచ్చేవాడని తెలిసింది. ఇటీవల ఆ యువతికి పెళ్లిసంబంధం కుదరడంతో సల్మాన్‌ను దూరంగా ఉంచడం మొదలు పెట్టింది. వచ్చే మే నెలలో ముహూర్తం నిర్ణయించడంతో ఆగ్రహం చెందిన సల్మాన్‌ మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో యువతి ఫ్లాట్‌కు వచ్చి కత్తితో దాడికి దిగగా, కుటుంబసభ్యుల కేకలతో అప్రమత్తమైన స్థానికులు పారిపోతున్న అతణ్ని పట్టుకుని నార్సింగి పోలీసులకు అప్పగించారు. గాయపడిన యువతిని స్థానికులే లంగర్‌హౌస్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వీపు భాగంలో రెండు తీవ్ర గాయాలు, రెండు చిన్నగాయాలయ్యాయి. ఆమె ఇప్పడు కోలుకుంటోందని పోలీసులు తెలిపారు.