బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ ‘లాగ్ 9 మెటీరియల్స్’ ద్విచక్ర, త్రిచక్ర విద్యుత్ వాహనాల బ్యాటరీలను 15 నిమిషాల్లోపే పూర్తిగా ఛార్జింగ్ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించింది. వేగంగా ఛార్జింగ్ అయ్యే బ్యాటరీని అభివృద్ధి చేయడానికి సూపర్కెపాసిటర్ టెక్నాలజీ, ‘గ్రాఫీన్’ను వినియోగించినట్లు లాగ్ 9 బృందం వెల్లడించింది. ఈ బ్యాటరీని ఒకసారి పూర్తి ఛార్జింగ్ చేసేందుకు 15 నిముషాల కంటే తక్కువ సమయమే సరిపోవడమే కాకుండా 15 ఏళ్లకు పైగా పనిచేస్తాయని తెలిపింది. ఇందువల్ల వాహన నిర్వహణ వ్యయం కూడా బాగా తగ్గడం వల్ల ప్రస్తుతానికి ఎక్కువగా వినియోగిస్తున్న లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే ఇవి 5 రెట్ల వరకు ఎక్కువ శక్తిని ఇవ్వడంతో, అగ్నిప్రమాదాల నిరోధంలో కూడా 5 రెట్లు అధిక భద్రమైనవని సంస్థ వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) ముగిసేనాటికి 3000కు పైగా వాహనాల్లో, 2022-23 నాటికి 20,000కు పైగా వాహనాల్లో ఈ బ్యాటరీలను అమర్చాలని ఐఐటీ రూర్కీలో రూపుదిద్దుకున్న లాగ్ 9 యొక్క ముఖ్య లక్ష్యం.