విజయమహల్‌ గేట్‌ సమీపంలో మంగళవారం ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకొని సంగీతం వింటూ పట్టాలపై వెళ్తున్న ఓ యువకుడ్ని రైలు ఢీకొట్టింది. కార్పెంటర్‌గా జీవనం సాగిస్తున్న బుచ్చిరెడ్డిపాళెం మండలం ఇస్కపాళేనికి చెందిన షఫీఉల్లా నగరానికి వచ్చి ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద బస్సు దిగి ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకొని సంగీతం వింటూ రైలు పట్టాలపై పొగతోటకు బయల్దేరారు. విజయమహల్‌ గేట్‌ సమీపానికి చేరుకొని చెన్నై వైపు నుంచి గూడ్స్‌ రైలు వస్తుండటాన్ని గమనించలేదు. స్థానికులు ఎంత పెద్దగా కేకలు వేసినా ఇయర్‌ఫోన్స్‌ ఉండటంతో వినపడకముందుకు వెళ్లడంతో రైలు వేగంగా ఢీకొట్టింది. క్షతగాత్రుడ్ని స్థానికులు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన నెల్లూరు చేరుకొని క్షతగాత్రుడ్ని మెరుగైన వైద్యం నిమిత్తం మెడికవర్‌ హాస్పిటల్లో చేర్పించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.