హైదరాబాద్ లో చార్టెట్ అకౌంటెంట్ అయిన వ్యక్తి ఏకంగా ఆరు లక్షల రూపాయలు కోల్పోయారు. మూడు వేల రూపాయల సైకిల్ ను అమ్మేసేందుకు ప్రయత్నించి ఏకంగా ఆరు లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు. ఉన్నత చదువులు చదివిన వాళ్లు కూడా సైబర్ దొంగల చేతుల్లో మోసపోతుండడం విచారకరం.


అసలు విషయం ఏంటంటే… గచ్చీబౌలి ప్రాంతానికి చెందిన ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఈ మధ్య తన వద్ద ఉన్న సైకిల్ ను ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టి దాని ధరను 3500 రూపాయలుగా నిర్ణయించారు. దాన్ని చూసిన ఓ సైబర్ నేరగాడు అతడికి ఫోన్ చేసి
తాను ఆ సైకిల్ ను కొనాలని అనుకుంటున్నట్టు నమ్మించాడు. తర్వాత ధరను కాస్త తగ్గించమని కోరగా మొత్తానికి ఇద్దరు కలిపి దాని ధర మూడు వేల రూపాయల దగ్గర ఒప్పందానికి వచ్చారు.

అయితే ముందుగా రెండు వేల రూపాయలను ఇస్తాననీ, సైకిల్ ను తీసుకునే సమయంలో మిగిలిన వెయ్యి రూపాయలు ఇస్తానని ఆ వ్యక్తి చెప్పగా దీనికి సరేనన్న చార్టెడ్ అకౌంటెంట్ డబ్బులను పంపించమని కోరారు. దానికి ఆ వ్యక్తి చార్టెడ్ అకౌంటెంట్ వాట్సప్ నెంబర్ కు ఓ క్యూఆర్ కోడ్ ను పంపి, ఆ తర్వాత ఫోన్ చేసి ‘మీకు ఓ క్యూఆర్ కోడ్ ను పంపించాను. దాన్ని స్కాన్ చేస్తే మీ అకౌంట్లోకి రెండు వేలరూపాయలు వస్తాయి.’ అని చెప్పాడు. సరేనని దాన్ని స్కాన్ చేస్తే చార్టెడ్ అకౌంటెంట్ ఖాతాలోంచి రెండు లక్షల రూపాయలు విత్ డ్రా జరిగినట్టు మెసేజ్ వచ్చింది. వెంటనే అతడికి ఫోన్ చేసి నా అకౌంట్లోంచి డబ్బులు పోయాయేంటి? అని నిలదీస్తే.. ‘అయ్యో, ఏదో పొరపాటు జరిగిందనుకుంటా సర్, మరో క్యూఆర్ కోడ్ ను పంపిస్తాను దాన్ని స్కాన్ చేయండి, మీ రెండు లక్షలతోపాటు అదనంగా మనం మాట్లాడుకున్న రెండు వేలు కూడా వస్తాయి’ అని చెప్పాడు. ఈసారి దానిని స్కాన్ చేస్తే మరో రెండు లక్షల రూపాయలు మాయం అయ్యాయి. దీంతో కోపోద్రిక్తుడయిన చార్టెడ్ అకౌంటెంట్ అతడికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేయగా, ఎదో టెక్నికల్ ఎర్రర్ అనిపిస్తోంది సర్. నేను ఈ సారి ఆ ప్రాబ్లం లేకుండా చేస్తాను. ఇదొక్కసారి ట్రై చేయండి. మీ డబ్బులు మీకు వస్తాయి. దాన్ని స్కాన్ చేస్తే రూ.4లక్షల రెండు వేల రూపాయలు వస్తాయి’ అని చెప్పాడు. ఈసారి మరొక రెండు లక్షలు కలిపి మొత్తం ఆరు లక్షల రూపాయలను ఆ చార్టెడ్ అకౌంటెంట్ కోల్పోయారు. ఈసారి మరలా కాల్ చేసి చూసేసరికి మొబైల్ స్విచాఫ్ అని వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన చార్టెడ్ అకౌంటెంట్ వెంటనే సైబరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.