60 ఏళ్లకు పైబడిన వృద్దులకు, 45 ఏళ్లకు పైబడిన దీర్ఘకాలిక రోగాలతో బాధ పడే వారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న విషయం పాఠకులకు విదితమే! ఈ నేపథ్యంలో క‌రోనా వ్యాక్సిన్‌పై ప్రజలలో ఉన్న అపోహ‌లను పొగొట్టేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.అయినప్పటికీ కొన్ని అపశ్రుతులు చోటుచేసుకుని ప్రజలకు అనుమానాలు పెంచుతూనే ఉన్నాయి. కొంతకాలం క్రితం వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న వ్యక్తులు వివిధ కారణాల చేత అస్వ‌స్థ‌త‌కు గురి కాగా మరికొంతమంది
మ‌ర‌ణించిన సంగతి తెలిసిందే. వారి మరణాలకు వ్యాక్సిన్‌కు ఎటువంటి సంబంధం లేద‌ని అధికారులు ధ్రువపరచారు.


ఇలా ఉండగా మ‌హారాష్ట్ర‌లోని థానే జిల్లా భీవండిలో క‌రోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్య‌క్తి కొద్దిసేపటికే మరణించడం చర్చ రేపుతోంది. బివాండీ నగరానికి చెందిన సుఖదేవ్ కిర్దత్ (45) కంటి వైద్యనిపుణుడి వద్ద డ్రైవరుగా పనిచేస్తున్నారు. సుఖదేవ్ కరోనా వ్యాక్సిన్ రెండవ డోస్ తీసుకున్నారు. 15 నిమిషాల తర్వాత పరిశీలన గదిలోనే మూర్చపోయాడు. వెంటనే అతడిని ఇందిరాగాంధీ స్మారక ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.జనవరి 28న ఆయన మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. నెలరోజుల క్రితం మొదటి డోస్ తీసుకున్నపుడు సుఖదేవ్ కు ఎలాంటి సమస్య రాలేదని, అయితే అతనికి కొన్నేళ్లుగా రక్తపోటు సమస్య ఉందని, కాళ్ల వాపు లక్షణాలు కూడా ఉన్నాయని భివాండీ మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారి కేఆర్ ఖరత్ తెలిపారు. కానీ సుఖ్‌దేవ్ కుటుంబ స‌భ్యులు మాత్రం అత‌నికి గ‌తంలో ఎలాంటి అనారోగ్యం లేద‌ని చెప్తున్నారు. ఇలాఉండగా సుఖ్ దేవ్ మరణానికి కారణం చెప్పాలంటే అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తరువాత వివరాలు వెల్లడిస్తామని డాక్టర్ ఖరత్ తెలిపారు.