మంగళవారం రిజర్వ్‌బ్యాంక్‌ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం ఏప్రిల్‌ 2020 నుంచి డిసెంబరు వరకు ఆంధ్రప్రదేశ్‌ రూ. 44,250 కోట్లు, తెలంగాణ రూ. 36,354 కోట్ల రుణాలను బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించాయి. బహిరంగ మార్కెట్‌ నుంచి అప్పులు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ ది 4వ స్థానం, తెలంగాణకు 6వ స్థానం.ఈ విషయంలో ఏపీ కంటే ముందు వరుసలో మహారాష్ట్ర (రూ. 65,000 కోట్లు), తమిళనాడు (రూ. 63,000 కోట్లు), కర్ణాటక (రూ. 55,000 కోట్లు) ఉండగా, తెలంగాణ కంటే ముందు ఈ నాలుగు రాష్ట్రాలతోపాటు, రాజస్థాన్‌ (రూ. 39,000 కోట్లు) కూడా నిలిచాయి.

డిసెంబరులో 30 రోజులపాటు స్పెషల్‌ డ్రాయింగ్‌ సౌకర్యం, 26 రోజులపాటు చేబదుళ్లు, 3 రోజులపాటు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉపయోగించుకొంది. ఇదే తరుణంలో తెలంగాణ ప్రభుత్వం 28 రోజులపాటు స్పెషల్‌ డ్రాయింగ్‌ సౌకర్యం, 20 రోజులపాటు చేబదుళ్లు, 13 రోజులపాటు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని వాడుకుని, నెలవారీగా బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు తీసుకున్నాక కూడా రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీరకపోతే ప్రభుత్వాలు ఈ మూడింటిలో ఏదో ఒక సౌకర్యాన్ని వాడుకొని ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకుంటూ ఉంటాయి. అలా కాకుండా మూడింటినీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వాడుకోవడం ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక ఇబ్బందుల తీవ్రతను బహిర్గతం చేస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు వరకు 29 రాష్ట్రాలు కలిపి బహిరంగ మార్కెట్‌ నుంచి మొత్తం రూ. 5,55,852 కోట్ల దాకా అప్పు చేయగా, డిసెంబరు నాటికి ఏపీ ప్రభుత్వం గత ఏడాది 12 నెలల్లో తీసుకున్నదానికంటే 4.3% అధికంగా అప్పుచేసి, తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది తీసుకున్నదాంట్లో 98.45%కి సమానంగా గల మొత్తాన్ని తీసుకొంది.