రాష్ట్ర ఎన్నికల సంఘం ఏపీలో జరగనున్న పురపాలక ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల సేవలపై ఆంక్షలు విధించిన విషయం పాఠకులకు విదితమే! పంచాయతీ ఎన్నికల వలె వార్డు వాలంటీర్లపై కూడా పలు ఫిర్యాదులు నమోదు అయ్యాయి. రాజకీయ కార్యకలాపాలకు వాలంటీర్లు దూరంగా ఉండాలని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికలు పార్టీ గుర్తులపైనే జరుగుతాయని, స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలంటే వాలంటీర్లపై కఠినచర్యలు అవసరమని, అభ్యర్థికి, పార్టీకి అనుకూలంగా వాళ్లు పాల్గొనకూడదని, పథకాల పేరు చెప్పి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదని, ఓటరు స్లిప్పుల పంపిణీని వార్డు వాలంటీర్లకు దూరంగా ఉంచాలని, వారి కదలికలను పరిశీలించాలని, లబ్ధిదారుల డేటా దృష్ట్యా వాలంటీర్ల ఫోన్లను నియంత్రించాలని వివరించారు. కమిషన్‌ ఆంక్షలు ఉల్లంఘించిన పక్షంలో కోడ్‌ ఉల్లంఘనగా పరిగణిస్తాం అని, సాధారణ బాధ్యతలు నిర్వహించే వాలంటీర్లకు ఎలాంటి అడ్డంకులు లేవు అని స్‌ఈసీ స్పష్టం చేశారు. ఎస్‌ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, దీనిపై ధర్మాసనం విచారణ జరిపి వాలంటీర్లపై ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేసింది. వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోరాదని హైకోర్టు స్పష్టం చేసింది.