దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమై సెన్సెక్స్‌ 50,7388 వద్ద , నిఫ్టీ 15,064 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఉదయం 9:33 గంటల సమయానికి సెన్సెక్స్‌ 324 పాయింట్లు పైకి ఎగిసి 50,617 వద్ద కొనసాగగా, నిఫ్టీ 108 పాయింట్లు లాభపడి 15,024 వద్ద ట్రేడింగ్ అవుతుంది. ఈరోజు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.24 వద్ద ఉంది.

అమెరికాలో కరోనా ఉద్దీపన పథకంతో ప్రపంచ‌ మార్కెట్లు సానుకూలంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందన్న సంకేతాలు ఆసియా మార్కెట్లను నడిపిస్తున్నాయి. కానీ అమెరికా మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్తో ముగింపు పలికాయి. బాండ్ల మార్కెట్ల వల్ల తలెత్తిన ప్రతికూలతల నుంచి సోమవారం అక్కడి సూచీలు భారీగా పుంజుకోవడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఇక దేశీయంగా స్పెక్ట్రమ్‌ వేలం కూడా ముగియడంతో టెలికాం రంగ షేర్లపై మదుపర్లు దృష్టి పెట్టనున్నారు. ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో పయనించడంతో ఈ పరిణామాలన్నీ నేడు మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి.

ఆటో రంగం మినహా దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే పయనిస్తున్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అలాగే హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, మారుతీ సుజుకీ ఇండియా, ఐషర్‌ మోటార్స్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.